పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా : బజరంగ్‌ పునియా సంచలన ప్రకటన

పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా : బజరంగ్‌ పునియా సంచలన ప్రకటన

ప్రముఖ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇప్పుడు ఇదే  క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్‌ సాక్షి మలిక్‌ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు చెప్పాడు. 

బజ్ రంగ్ పునియా లేఖలో ఏముంది..?   

‘‘ప్రియమైన ప్రధాని మోదీజీ.. మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారని తెలుసు. కానీ.. ఈ దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు లేఖ రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై 2023, జనవరిలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. వారికి మద్దతుగా నేను కూడా ఆ నిరసనలో పాల్గొన్నా. ఆ సమయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో మేం ఆందోళన విరమించాం. కానీ.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో మళ్లీ ఆందోళనలు చేయాల్సి వచ్చింది. న్యాయం కోసం మా పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నాం. అప్పుడు కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది’ అని బజ్‌రంగ్‌ తాను రాసిన లేఖలో ఈ విషయాలన్నీ చెప్పాడు. 

తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లినట్లయ్యిందని చెప్పాడు బజ్ రంగ్ పునియా. ఇప్పుడు తామంతా (రెజర్లు) న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలో అర్థం కావట్లేదన్నారు. తనకు 2019లో పద్మశ్రీ వచ్చిందని, అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయన్నారు. కానీ, ఈ రోజు మహిళా రెజ్లర్లు తమకు భద్రత లేని కారణంగా ఆటకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయని, ఈ ఇష్యూ తనను ఎంతగానో కుంగదీసిందని చెప్పారు. అందుకే తన పద్మశ్రీని మీకే (ప్రధాని మోదీ) తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నా అని పునియా తన లేఖలో చెప్పాడు. 

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ స‌న్నిహితుడే.. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన  సంజయ్‌ సింగ్. 47 ఓట్లలో సంజ‌య్ సింగ్‌కు 40 ఓట్లు పోల‌య్యాయి. రెజ్లింగ్ స‌మాఖ్య ఎన్నిక‌ల్లో అనితా షీరాన్ ఓట‌మి పాల‌య్యారు. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో స్వర్ణం గెలిచిన అనితాకు టాప్ రెజ్లర్లు మ‌ద్దతు ఇచ్చారు. కానీ స‌మాఖ్య ఎన్నిక‌ల్లో మాత్రం బ్రిజ్ వ‌ర్గానికే పెద్ద పీట ద‌క్కింది. బ్రిజ్ గ‌త 12 ఏళ్లుగా రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిజ్ భూష‌ణ్ త‌మ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు మ‌హిళా రెజ్లర్లు ఆరోపించిన కేసులో ఆయ‌న స‌మాఖ్య బాధ్యత‌ల నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.