అస్సాంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. సేఫ్ గా డిఫ్యూజ్ చేసిన ఆర్మీ

అస్సాంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. సేఫ్ గా డిఫ్యూజ్ చేసిన ఆర్మీ

టిన్సుకియా: అస్సాంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు లభ్యమైంది. టిన్సుకియా జిల్లా లెడో-లేఖాపాని ప్రాంతంలోని ఓ నివాస స్థలంలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి పేలని బాంబు ఒకటి కలకలం సృష్టించింది. సుమారు 12 అంగుళాల పొడవు, 6 అంగుళాల వ్యాసం కలిగిన ఈ తుప్పు పట్టిన పేలుడు పదార్థం జనావాసాల మధ్య లభించడంతో స్థానికులు అక్కడి అధికారులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆర్మీకి సమాచారం అందించారు. 

సమాచారం అందిన వెంటనే భారత సైన్యానికి చెందిన 'రెడ్ షీల్డ్ సాపర్స్' బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. బాంబు ఉన్న ప్రాంతాన్ని సైన్యం వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని, చుట్టుపక్కల నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎటువంటి ప్రమాదం జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టింది. అనంతరం బాంబు డిస్పోజబుల్​స్క్వాడ్ టీం ఆ బాంబును నిశితంగా పరిశీలించిన తర్వాత.. దానిని జనావాసాలకు దూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అక్కడ నియంత్రిత పద్ధతిలో పేల్చివేసి.. ఆ పరికరాన్ని నిర్వీర్యం చేశారు.