యాదాద్రి: భూ రిజిస్ట్రేషన్ వివాదం.. ఆఫీసర్ల దిద్దుబాటు

యాదాద్రి: భూ రిజిస్ట్రేషన్ వివాదం.. ఆఫీసర్ల దిద్దుబాటు
  • హడావుడిగా ప్రొహిబిటేడ్​ సైట్​లో డిటైల్స్​ అప్​లోడ్​..!

యాదాద్రి, వెలుగు : భూ రిజిస్ట్రేషన్​ వివాదంపై యాదాద్రి జిల్లాఫీసర్లు దిద్దుబాటు చర్యలకు దిగారు. శుక్రవారం రాత్రే చౌటుప్పల్​ తహసీల్దార్​కు షోకాజ్​ నోటీసు జారీ చేసిన ఆఫీసర్లు భూమికి సంబంధించిన వివరాలు ప్రొహిబిటెడ్​ సైట్​లో హడావుడిగా అప్​లోడ్​ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలంలోని తూప్రాన్​పేటలో ఎన్​కౌంటర్​కు గురైన గ్యాంగ్​ స్టర్​ నయీమ్​కు సంబంధించిన ల్యాండ్​ సర్వే నెంబర్​ 13/ ఇ/1, సర్వే నెంబర్​ 14/అ/1లోని 5.5 ఎకరాల భూమిని ప్రొహిబిటేడ్​లో ఉంది. ఈ భూమికి సంబంధించిన డిటైల్స్​ 22ఏ (1),(ఇ)లో చేర్చాలని గతేడాది ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయినప్పటికీ ఈ భూమిని 22 ఏ (1)(ఇ)లో చేర్చలేదు.

దీంతో కొందరు వ్యక్తులు ఆ భూమిని రిజిస్ట్రేషన్​  చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా గత వారం చౌటుప్పల్​లోని రిజిస్ట్రేషన్​ ఆఫీసుకు చేరుకొని భూమిని రిజిస్ట్రేషన్​ కోసం ప్రయత్నించారు. అయితే ఈడీ కేసుల కారణంగా ఈ భూమిని రిజిస్ట్రేషన్​ చేయమని రిజిస్ట్రార్​ చెప్పినట్టు తెలిసింది. అనంతరం ఈ భూమి రిజిస్ట్రేషన్​ వివాదంపై సీసీఎల్​ఏకు సమాచారం అందించారు. అక్కడి నుంచి జిల్లాలోని హయ్యర్​ ఆఫీసర్లకు ఆదేశాలు రావడంతో తహసీల్దార్​ వీరాబాయికి షోకాజ్​ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ప్రొహిబిటేడ్​ సైట్​లో వివరాలు అప్​లోడ్​..!

వాస్తవానికి సర్వే  నెంబర్లు 13/ఇ/1, సర్వే నెంబర్​ 14/అ/1లోని 5.5 ఎకరాల భూమి వివరాలు శనివారం రాత్రి వరకూ ప్రొహిబిటెడ్​ సైట్​లోని 22 ఏ (1),(ఇ)లో లేవు. రిజిస్ట్రేషన్​ వ్యవహారం బయటపడడం, హయ్యర్ ఆఫీసర్లు సీరియస్​ కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ భూమికి సంబంధించిన వివరాలతో ఆర్డర్స్​ రూపొందించినట్టుగా తెలిసింది. ​ఆ తర్వాతే ఈ రెండు సర్వే నెంబర్ల భూమి వివరాలను ప్రొహిబిటెడ్​ సైట్​లోని 22 ఏ (1), (ఇ) అప్​లోడ్​ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదివారం ఈ సైట్​లో భూమికి సంబంధించిన వివరాలు కన్పించాయి.