నాలుగోసారి సీఎం కానున్న యెడ్యూరప్ప

నాలుగోసారి సీఎం కానున్న యెడ్యూరప్ప

విశ్వాసపరీక్షలో ఓటమి తర్వాత తనకు సహకరించిన మీడియాకు థ్యాంక్స్ అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయారు కుమారస్వామి. సభకు రాకుండా విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరతామన్నారు సిద్ధరామయ్య. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి పీఠమెక్కనున్నారు బొక్కనకెరె సిద్ధలింగప్ప యెడ్యూరప్ప. విశ్వాసపరీక్షలో కుమారస్వామి సర్కార్ ను కూల్చిన యెడ్డీ… రేపోమాపో సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాసపరీక్ష ఓటమితో విక్టరీ మూడ్ లో ఉన్న యెడ్డీ… తమది ప్రజస్వామిక విజయమన్నారు. కర్ణాటక అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ ప్రకటించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

2007లో మొదటిసారి కర్ణాటక సీఎం అయ్యారు యెడ్యూరప్ప. 2007 నవంబర్ 12 నుంచి అదే నెల 19వరకు సీఎంగా ఉన్నారు. మొత్తంగా మొదటిసారి 7 రోజులే సీఎం అయ్యారు యెడ్డీ. రెండోసారి 2008 మే 30 నుంచి 2011 జులై 31వరకు సీఎంగా ఉన్నారు. మళ్లీ 2018 మే 17 నుంచి మే 19వరకు రెండు రోజులు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో తగినంత మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు యెడ్డీ. ఇప్పుడు నాలుగోసారి సీఎం పదవి చేపట్టబోతున్నారు.

అసెంబ్లీ ముగిసిన తర్వాత బెంగళూరులో గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు కుమారస్వామి. రాజీనామా లెటర్ అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని కోరారు గవర్నర్. యెడ్యూరప్ప సీఎం పదవి చేపట్టవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు కుమారస్వామి.

ముంబయిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. దీంతో వారి రాజీనామాల ఆమోదం తర్వాతే… బీజేపీలో చేరాలా..? వద్దా..? అన్నది 16 మంది రెబెల్స్, ఇద్దరు స్వతంత్రులు నిర్ణయించుకుంటారని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ చెప్పారు. తమకు 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున… స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.

విశ్వాసపరీక్ష నేపథ్యంలో… బెంగళూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి సిటీలో 144 సెక్షన్ అమలవుతోంది. 48 గంటల పాటు బార్లు, పబ్ లు, రెస్టారెంట్ లు మూసివేయాలని ఆదేశించారు సిటీ పోలీస్ కమిషనర్.