అర్ధరాత్రి దహన సంస్కారాల్లో యోగి సర్కార్ పాత్ర

అర్ధరాత్రి దహన సంస్కారాల్లో యోగి సర్కార్ పాత్ర

ముంబై: హత్రాస్ బాధితురాలి మృత దేహానికి అర్ధరాత్రి దహన సంస్కారాలు చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉందని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ సేన ఆరోపించింది. యూపీ గవర్నమెంట్ బాధితురాలి దేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు పోలీసుల సాయంతో ఆమె కుటుంబీకుల గొంతుకలను అణచాలని చూస్తోందని శివ సేన పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌‌లో మండిపడింది.

‘హత్రాస్ కేసుపై సీబీఐ విచారణ చేయాలని యూపీ ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. అది కూడా ఈ కేసులో న్యాయపరమైన విచారణ జరగాలంటూ బాధితరురాలి కుటంబం కోరుకున్న నేపథ్యంలో సిఫార్సులు చేయడం గమనార్హం. అయినా బాధితురాలికి అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వమే నాశనం చేశాక సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏముందని? ఉన్నతాధికారులను అడగడకుండా హత్రాస్ పోలీసులు ఇలా చేస్తారా? ఒకరితో ఒకరు కుమ్మక్కవడం వల్లే ఇదంతా జరిగింది. ముంబైకి చెందిన నటీమణికి సెంట్రల్ సర్కార్ వై-ప్లస్ భద్రత కల్పించింది. కానీ హత్రాస్ దళిత బాధితులకు మాత్రం బెదిరింపులు వస్తున్నాయి. ఇది వారిని భయపెట్టడంతో పాటు భయం ముసుగులో బతికేలా చేస్తోంది. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని సమాన న్యాయం అనే దానికి ఇది కరెక్ట్ కాదు’ అని సామ్నా పేర్కొంది.