హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ కాగా.. మరో కానిస్టేబుల్, సీఐకి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై అబిడ్స్, అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. ఆదివారం (జులై 26) మధ్యాహ్నం హెచ్ న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్‌లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం అందింది.
దీనితో అతను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, హెచ్ న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఇతర ఇబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఓ కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్ వేర్ వద్దకు రాగానే ఓ వ్యక్తి అతనికి ఒక ప్యాకెట్‌ను అందజేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుస్సేని అలంకు చెందిన సైఫ్‌కు పోలీసులు ఐడీ కార్డులు చూపెట్టి కారు నుండి దిగాలని సూచించారు.
దీంతో కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్.. ఒక్కసారిగా కారును రివర్స్ చేశాడు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలు సై నుండి కారు ఎక్కించాడు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అతన్ని ఛేజ్ చేసి అఫ్జల్ గంజ్ దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , మరో కానిస్టేబుల్ వంశిధర్ లకు స్వల్ప గాయాలయ్యాయి. అప్జల్ గంజ్ వద్ద సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాలుపై నుండి కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు కాలు ఫ్రాక్చర్ అయింది. అతన్ని సోమజిగూడా యశోద హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్ , అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లలో అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు అయ్యాయి. సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
