మాలే: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) అండర్–-20 చాంపియన్‌షిప్‌లో యంగ్ టీమిండియా అద్భుత ఆటతో ఆకట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3–-0 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఇండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకోగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మూడో నిమిషంలోనే విశాల్ యాదవ్ గోల్ కొట్టగా.. 64వ నిమిషంలో ఓమాంగ్ దోదుమ్ హెడ్డర్‌తో రెండో గోల్ అందించాడు. 88వ నిమిషంలో లభించిన పెనాల్టీని దోదుమ్ గోల్‌గా మార్చడంతో ఇండియా విజయం అందుకుంది. దోదుమ్ ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. గ్రూప్ దశలో ఇండియా తన తర్వాతి మ్యాచ్‌లో 28న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
