వరల్డ్‌‌ ఫేమస్‌‌ టీచర్లలో ఖాన్ ఒకరు

వరల్డ్‌‌ ఫేమస్‌‌ టీచర్లలో ఖాన్ ఒకరు

ఆయన క్లాస్‌‌ వినడానికి కొన్ని లక్షల మంది వెయిట్‌‌ చేస్తుంటారు. యూట్యూబ్‌‌లో ఇలా అప్‌‌లోడ్‌‌ చేయగానే అలా కొన్ని వేల మంది చూస్తారు. ఎందుకంటే.. ఖాన్‌‌ సర్‌‌‌‌ క్లాస్‌‌లు వింటే ఎలాంటి విషయమైనా ఈజీగా అర్థమవుతుంది. తన నేటివ్‌‌ స్టైల్‌‌లో పాఠం చెప్తే ఎలాంటి వాళ్లైనా శ్రద్ధతో వింటారు. ఆ టీచింగ్ స్టైల్‌‌ వల్లే ఇండియాలో ఫేమస్‌‌ అయ్యాడు. అంతెందుకు యూట్యూబ్‌‌లో పాఠాలు చెప్తున్న వరల్డ్‌‌ ఫేమస్‌‌ టీచర్లలో ఖాన్ ఒకరు.  

ఖాన్ 1993లో ఉత్తరప్రదేశ్‌‌లోని డియోరియాలోని భట్‌‌పర్ రాణిలో పుట్టాడు. అతని అసలు ఫైజల్ ఖాన్‌‌ అయినా.. ‘‘ఖాన్‌‌ సర్‌‌‌‌ పాట్నా” పేరుతో ఫేమస్ అయ్యాడు. భట్‌‌పర్ రాణిలోని పర్మార్ మిషన్ స్కూల్‌‌లో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని డిసైడ్‌‌ అయ్యాడు. వెంటనే సైనిక్ స్కూల్‌‌లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌ రాశాడు. కానీ, ఫెయిల్ అయ్యాడు. అయినా.. లక్ష్యాన్ని వదలకుండా టెన్త్‌‌ క్లాస్‌‌లో ఉన్నప్పుడు ఎన్‌‌సీసీలో చేరాడు. ఇంటర్‌‌‌‌ పూర్తికాగానే ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కష్టపడి చదివి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌‌డీఏ) ఎగ్జామ్ రాశాడు. అతను చదువులోనూ ఎప్పుడూ టాప్‌‌లో ఉండేవాడు. అందుకే ఎగ్జామ్‌‌లో క్వాలిఫై అయ్యాడు. కానీ.. ఆర్మీకి సెలక్ట్‌‌ కాలేదు. కారణం.. అతని చేతులు కాస్త వంకరగా ఉండటం. దానివల్ల మెడికల్‌‌ టెస్ట్‌‌లో అన్‌‌ఫిట్‌‌ అని అప్లికేషన్‌‌  రిజెక్ట్ చేశారు. దాంతో సైన్యంలో చేరాలన్న అతని కల కలగానే ఉండిపోయింది. 

నిరుత్సాహపడలేదు
అనుకున్నది సాధించలేదని కుంగిపోకుండా చదువు కొనసాగించాడు. డిగ్రీ చదవడానికి అలహాబాద్‌‌కు వెళ్లాడు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నాడు. డిగ్రీ చదువుతున్న టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్‌‌ సోను, పవన్, హేమంత్ సాయం చేయడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగాడు. వాళ్లు తమ పాకెట్ మనీలో నుంచి అతనికి కొంత ఇచ్చేవాళ్ళు. కొన్ని రోజులు చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పాడు. అలా వచ్చిన డబ్బుతో ఫీజులు కట్టుకునేవాడు. అప్పుడే అతనిలో ఉన్న టాలెంట్‌‌ గురించి తెలుసుకున్నాడు. తర్వాత అదే ఆయనకు ఉపాధిగా మారింది. ఖాన్ దగ్గర ట్యూషన్‌‌ చెప్పించుకున్న పిల్లలంతా బాగా చదివేవాళ్లు. స్కూల్‌‌లో మూడంకెల ర్యాంకులు తెచ్చుకునే పిల్లలకు ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. దాంతో ఫ్రెండ్‌‌ హేమంత్ అతనికి కాంపిటేటివ్‌‌ ఎగ్జామ్స్‌‌ కోచింగ్ సెంటర్‌‌‌‌లో టీచర్‌‌గా చేరాలని సలహా ఇచ్చాడు. అప్పుడు అలహాబాద్‌‌లోని ఒక చిన్న ఇనిస్టిట్యూట్‌‌లో చేరాడు. తన క్లాస్‌‌లో ఆరుగురు స్టూడెంట్స్‌‌ మాత్రమే ఉండేవాళ్లు. కానీ.. ఖాన్ చదువు చెప్పే స్టైల్‌‌ నచ్చడంతో.. తక్కువ టైంలోనే చాలామంది జాయిన్‌‌ అయ్యారు. కొన్నిరోజుల్లోనే వేలాది మంది స్టూడెంట్స్‌‌తో కోచింగ్‌‌ సెంటర్‌‌‌‌ కిక్కిరిసిపోయింది. 

డబ్బు కోసం కాదు 
తక్కువ టైంలోనే కోచింగ్ సెంటర్‌‌‌‌ ఆదాయం పెరిగింది. ఖాన్‌‌ క్లాస్‌‌లకు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే ఖాన్ క్లాసులకు ఫీజులు పెంచుతామని అనౌన్స్ చేసింది మేనేజ్‌‌మెంట్‌‌. దానికి ఖాన్‌‌ ఒప్పుకోలేదు. అయినా.. మేనేజ్‌‌మెంట్‌‌ వినకపోవడంతో మరో కోచింగ్‌‌ సెంటర్‌‌‌‌కి మారాడు. అలా క్లాసులు చెప్తూనే అలహాబాద్‌‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత పాట్నాకు మారి, అక్కడే సొంతంగా కోచింగ్ సెంటర్ పెట్టాడు. కానీ.. అక్కడ కూడా అతని పార్ట్‌‌నర్స్‌‌ మోసం చేశారు. అప్పుడు పుట్టిందే ఈ ‘‘ఖాన్ జీఎస్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌‌‌’’.  మొదట్లో ఈ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌‌లో కూడా చాలా తక్కువమంది స్టూడెంట్స్‌‌ ఉండేవాళ్లు. కానీ.. కొన్ని రోజుల్లో క్లాస్‌‌ రూమ్‌‌ నిండిపోయేంత మంది చేరారు. తర్వాత ఒకే క్లాస్‌‌లో దాదాపు 2,000 మందికి పైగా స్టూడెంట్స్‌‌కి క్లాస్‌‌ చెప్పేవాడు. 

యూట్యూబ్‌‌లోకి.. 
సొసైటీలో ఫేమ్ ఉన్న వాళ్లంతా యూట్యూబ్‌‌లో ఫేమస్‌‌ అయిపోరు. కానీ, ఖాన్‌‌ టీచింగ్‌‌ స్టైల్ వల్ల యూట్యూబ్‌‌లో కూడా ఫేమస్‌‌ అయ్యాడు. స్టూడెంట్స్‌‌కి మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో 2019లో యూట్యూబ్‌‌లోకి అడుగుపెట్టాడు. ‘‘ఖాన్ జీఎస్‌‌ రీసెర్చ్ సెంటర్‌‌” పేరుతో యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టాడు. దాంతో ఆయన సక్సెస్‌‌ రెట్టింపు అయింది. ‘‘ఒక సినిమా చూసినప్పుడు ఎంత సరదాగా ఉంటుందో.. ఖాన్‌‌ సర్‌‌‌‌ క్లాస్ వింటున్నా అంతే సరదాగా అనిపిస్తుంది. దాంతో సబ్జెక్ట్‌‌ అర్థమవుతుంది” అంటున్నారు ఆయన స్టూడెంట్స్‌‌. అంతేకాదు.. ఆయన యూట్యూబ్‌‌ ఛానెల్‌‌లో క్లాస్‌‌లతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఛానెల్‌‌కు 16.5 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. అతని ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్‌‌ వస్తున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం ఆయనకు యూట్యూబ్‌‌ నుంచే నెలకు 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు వస్తున్నాయి.