రంజాన్ టైంలో ఫుడ్ లవర్స్ హలీమ్ తినడానికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వస్తుంటారు. ఇలా నచ్చిన ఫుడ్‌ని టేస్ట్ చేయడానికి చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు.కానీ.. ఇతను కొత్త రకమైన ఫుడ్స్ గురించి తెలుసుకునేందుకు, వాటిని టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లో ఫుడ్ కల్చర్స్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ డబ్బు కూడా సంపాదిస్తున్నాడు విల్ సన్బచ్నర్.
ప్రపంచంలో ఫుడ్ లవర్స్ చాలామందే ఉంటారు. కానీ.. వాళ్లలో కొందరు మాత్రం ఎప్పుడూ డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వ్యక్తే విల్(విలియం) సన్బచ్నర్. కొత్త రకమైన ఫుడ్స్ కోసం కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తుంటాడు. ఆ జర్నీలో కొన్నిసార్లు రిస్క్ కూడా చేస్తుంటాడు. ఒక దేశంలో ఫేమస్ ఫుడ్.. మరో దేశం వాళ్లకు వింతగా అనిపించొచ్చు.
అందుకే విల్ అలాంటి వింతలను చూడాలని ప్రపంచయాత్ర మొదలుపెట్టాడు. విల్ సన్బచ్నర్ ఫేమస్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు.. మంచి ట్రావెల్ వ్లాగర్ కూడా. అతను ఆగస్టు 22, 1984న యునైటెడ్ స్టేట్స్‌లోని మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్‌లో పుట్టాడు. విల్‌కు ఇద్దరు తోబుట్టువులు. వాళ్లు బాగా చదువుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు.
కానీ.. విల్ మాత్రం చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ప్రపంచయాత్ర చేస్తున్నాడు. విల్ సౌక్ రాపిడ్స్-రైస్ హై స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత కాలేజీలో చేరాడు. కానీ.. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశాడు. స్కూల్ డేస్ నుంచే అతను డిఫరెంట్‌గా కనిపించే ఫుడ్ తినేందుకు ఇష్టపడేవాడు. కానీ.. వాళ్లది మధ్య తరగతి కుటుంబం కావడంతో కాస్ట్లీ ఫుడ్ తినేవాళ్లు కాదు. అందుకే ఉద్యోగంలో చేరాక కొత్త రకం ఫుడ్స్ తినడం మొదలుపెట్టాడు.
జర్నీ ఎక్కడ మొదలైంది?
విల్ ఒకసారి దక్షిణ కొరియాకు వెళ్లాడు. అక్కడివాళ్లకు ఇంగ్లిష్ నేర్పించాడు. అదే టైంలో విల్ అక్కడ సినిమా మేకింగ్ గురించి నేర్చుకున్నాడు. తిరిగి అమెరికా వచ్చాక ఆ నాలెడ్జ్‌తో ‘‘సెకండ్– టైర్ కే – -పాప్ స్టార్స్” పేరుతో వీడియోలు తీశాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తనకు నచ్చిన పని ఫుడ్‌కి రివ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అందుకోసం 2010లోనే ‘బెస్ట్ ఎవర్ ఫుడ్ రివ్యూ షో’ పేరుతో ఛానెల్ పెట్టాడు.
ఇప్పుడు ఆ ఛానెల్‌కు 9.85 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వియత్నాం వెళ్లినప్పుడు చేసిన వీడియోల వల్ల విల్ బాగా పాపులర్ అయ్యాడు. అక్కడి వాళ్లతో మాట్లాడి వియత్నాం ఆహార అలవాట్లను, ఫుడ్ వండే విధానాన్ని బాగా చూపించాడు. ముఖ్యంగా ట్రైబల్ ఫుడ్ కల్చర్‌ని బాగా చూపించాడు. అయితే.. అతని జర్నీలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.
ముఖ్యంగా అతను ఈజిప్ట్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఆఫీసర్లు కెమెరాతో సహా అతని దగ్గరున్న ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకున్నారు. చివరకు ఈజిప్టు గవర్నమెంట్‌తో మాట్లాడి, అతను రికార్డ్ చేసిన ఫుటేజీ నుంచి కొంత డిలీట్ చేసి, వాటిని తిరిగి తీసుకున్నాడు. యూట్యూబ్ జర్నీ చేస్తూనే 2022లో కార్లీ కొరింత్ని పెండ్లి చేసుకున్నాడు విల్. కానీ.. కొన్నాళ్లకే వాళ్లు విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి.
క్వాలిటీ వీడియోలు
విల్ యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో వీడియోల క్వాలిటీ బాగుండేది కాదు. కానీ, ఆ తర్వాత ఎక్విప్మెంట్స్ అప్‌గ్రేడ్ చేసి వీడియో క్వాలిటీ పెంచాడు. సినిమాటిక్ షాట్స్‌తో వీడియోలు చేస్తున్నాడు. వెళ్లిన ప్రతిచోట ఆ ప్రాంతాన్ని డ్రోన్‌తో అందంగా షూట్ చేసి వీడియోల్లో చూపిస్తాడు. విల్‌కు సబ్‌స్క్రయిబర్స్ పెరగడానికి వీడియో క్వాలిటీ కూడా ఒక కారణమే.
ఈ జర్నీలో ఫుడ్ వ్లాగింగ్‌తో పాటు కామెడీ కూడా చేస్తుంటాడు విల్. పైగా ప్రతి దేశంలో రెగ్యులర్‌గా దొరికే ఫుడ్ మీద కాకుండా డిఫరెంట్‌గా ఉండే ఫుడ్ మీద ఫోకస్ పెడుతుంటాడు. అతను ఈ మధ్య ఇండియాకు వచ్చాడు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ కల్చర్‌పై వీడియోలు చేశాడు. 30 దేశాల వరకు తిరిగాడు. యూట్యూబ్ ద్వారా రెండు మిలియన్ల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువే సంపాదించాడు.
