మావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ పెరిగి గుండె ఆగిపోయేలా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( మే 21 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని.. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీకి భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా పోతుందని అన్నారు జగన్.
అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు జగన్. స్కామ్‌ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని.. ఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారని అన్నారు.
అమరావతి కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.9 వేల 200 కోట్లు ఖర్చు చేయబోతున్నారని... స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతొందని అన్నారు. రాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించానని.. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ను ప్రత్యామ్నాయంగా చూపించానని స్పష్టం చేశారు జగన్.
అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలని...మావిగన్‌లో అన్నీ ఉన్నాయని అన్నారు. ప్రజలు కూడా మావిగన్‌కు మద్దతు పలికారని.. అది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని అన్నారు జగన్.
