
కడప జిల్లా : ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ..పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ శర్మిల, మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివేకానందరెడ్డిని చివరిసారిగా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
అంతకుముందు వివేకానందరెడ్డి ఇంటి దగ్గర ప్రార్థనలు చేశారు. ఆతర్వాత ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు.