V6 News

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్... విజయ్ తో అన్నాడీఎంకే చర్చలు.!

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్... విజయ్ తో అన్నాడీఎంకే చర్చలు.!

తమిళనాడులో   విజయ్ పార్టీ టీవీకే భారీ స్థానాలు గెలుచుకుంటుందని  పలు  ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఒక వేళ హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న సందేహంతో ఏఐడీఎంకే ముందస్తుగా పావులు కదుపుతోంది. విజయ్ తో చర్చలు జరిపేందుకు  ఆ పార్టీ  సిద్దమవుతున్నట్లు  తమిళ రాజకీయాల్లో చర్చ మొదలైంది. 

యాక్సిస్ మై ఇండియా  సర్వే అంచనాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే అధికార డీఎంకే కూటమితో దాదాపు సమానంగా నిలవబోతోంది. ఈ సర్వే ప్రకారం డీఎంకే -కాంగ్రెస్ కూటమి 92 నుంచి 110 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుండగా.. ఎన్డీయే 22 నుంచి 32 స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఓట్ల శాతం పరంగా కూడా టీవీకే ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార కూటమితో సమానంగా టీవీకే సుమారు 35 శాతం ఓట్ల వాటాను దక్కించుకుంటుందని అంచనా. ఇదే సమయంలో ఏఐఏడీఎంకే కూటమి 23 శాతం ఓట్లతో వెనుకబడిపోయింది. అందుకే ఇప్పుడు విజయ్ పార్టీతో చర్చలు జరిపే దిశగా ఏఐఏడీఎంకే అడుగులు వేస్తోందని ప్రచారం జరుగుతోంది. టీవీకే సాధించే సీట్ల సంఖ్యే రేపటి కింగ్ మేకర్ ఎవరో డిసైడ్ చేయబోతోంది.

విజయ్‌కు వెన్నెముకగా నిలిచింది రాష్ట్రంలోని యువతే. సర్వే వివరాల ప్రకారం.. 18 నుండి 19 ఏళ్ల వయసున్న తొలిసారి ఓటర్లలో ఏకంగా 68 శాతం మంది విజయ్ వైపే నిలిచారు. అలాగే 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లలో మెజారిటీ మద్దతు టీవీకేకే లభించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లతో పాటు ఓబీసీ, ఎస్సీ మరియు మైనారిటీ వర్గాల్లో కూడా టీవీకే బలమైన పట్టు సాధించింది.

ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు.. 37 శాతం మంది విజయ్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ కంటే విజయ్ స్వల్పంగా ముందుండటం విశేషం.  ఓటర్లు విజయ్‌కు పట్టం కడతారా? మే 4న వెలువడనున్న ఫలితాలు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తాయనేది వేచి చూడాలి