చిన్నారుల చదువు కోసం 700 కోట్లు

చిన్నారుల చదువు కోసం 700 కోట్లు

చాలా కంపెనీలు తమ దగ్గర పని చేసేవాళ్లకు అప్పుడప్పుడు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు ఇస్తుంటాయి.  ఇంకొన్ని కంపెనీలైతే వాళ్ల దగ్గర చాలా ఏండ్ల నుండి పని చేస్తున్నవాళ్లకు ఇండ్లు కట్టించడం లాంటివి చేస్తుంటాయి. అలాకాకుండా ఉద్యోగులకు లైఫ్‌ టైం సెటిల్‌ అయ్యే ఆఫర్ ఇచ్చేవాళ్లు చాలా అరుదు. అలాంటి పనే చేసింది ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మంచి ఆఫర్‌ ఇచ్చి అరుదైన జాబితాలోకి ఎక్కింది. జొమాటోలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల భవిష్యత్​ కోసం ‘జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌’ను మొదలుపెట్టింది. దానికోసం మొత్తం 700 కోట్లను డొనేట్‌ చేశాడు ఆ కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్‌. 

దేండ్లుగా ఆ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల చదువుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. జొమాటో పబ్లిక్ లిస్టింగ్‌లోకి వెళ్లకముందు దీపేందర్ గోయల్ పనితీరుకు బోర్డ్‌, ఇన్వెస్టర్స్‌ కొన్ని ఈఎస్ఓపీ (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్)లను ఇచ్చారు. వాటిలో కొన్నిటి గడువు తీరడంతో ఆ షేర్లను అమ్మేయాలి అనుకున్నాడు గోయల్.

ఈఎస్ఓపీల షేర్స్‌ విలువ మన కరెన్సీలో దాదాపు 700 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ షేర్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని జొమాటో ప్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్టు గోయల్ చెప్పాడు. ఈ మొత్తం డబ్బును జొమాటోలో పనిచేసే ఉద్యోగుల, డెలివరీ బాయ్స్‌ పిల్లల చదువు కోసం వాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కొన్ని టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్ పెట్టాడు. అవేంటంటే... ‘‘జొమాటో కంపెనీలో ఐదేండ్లు పని చేయాలి. ఆ తరువాతే ఆ ఉద్యోగుల పిల్లల చదువుకు ఏడాదికి 50వేల రూపాయల ఆర్థిక సాయం ఇస్తాం. పదేండ్ల సర్వీస్​ పూర్తిచేసుకున్న ఉద్యోగుల పిల్లల చదువుకోసం ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇస్తాం. డెలివరీ విమెన్​గా పనిచేస్తున్న వాళ్లకు ఈ నిబంధన పదేండ్ల కంటే తక్కువగా ఉంటుంది.  వీటితో పాటు.. పనిలో ఉన్నప్పుడు డెలివరీ సిబ్బంది ప్రమాదవశాత్తూ చనిపోతే వాళ్ల కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తాం. దీనికి వాళ్లు ఎన్నేండ్లు కంపెనీలో పని చేశారనే నిబంధన ఏమీ లేదు.” 

ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులందరికీ ఓపెన్​ లెటర్‌‌ రాసి మరీ చెప్పాడు గోయల్. అలానే ఆడపిల్లల కోసం జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రత్యేక ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇంటర్‌‌ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డెలివరీ పార్ట్​నర్లుగా ఉన్న ఆడపిల్లలకి ప్రైజ్ మనీ ఇవ్వబోతోంది. ఈ ఆలోచన గురించి దీపేందర్​ను అడిగితే ‘‘ఉద్యోగుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఎండనక, వాననక వాళ్లు చేస్తున్న కష్టం ముందు మేం ప్రకటించిన సాయం చాలా చిన్నది’’ అన్నాడు. ఉద్యోగుల వెల్ఫేర్​ గురించి ఇన్ని చేస్తున్న జొమాటో ఒక్కసారిగా మార్కెట్​లోకి వచ్చి సక్సెస్​ తెచ్చుకున్న కంపెనీ ఏంకాదు. మార్కెట్​లో నిలదొక్కుకునేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 

జొమాటో గురించి
ఫుడ్‌ డెలివరీ రెవల్యూషన్‌లో మొదటి అడుగు వేసింది జొమాటోనే. ఈ కంపెనీని దీపేందర్‌‌ గోయల్‌, పంకజ్‌ చందా కలిసి 2008లో ‘ఫుడీబే’ పేరుతో మొదలుపెట్టారు. తరువాత కొన్నేండ్లకు ఫుడీబే పేరును ‘జొమాటో’గా మార్చారు. అదే ఇప్పుడు రోజూ 1.2 మిలియన్‌ ఆర్డర్లతో ఇండియాలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్‌గా ఎదిగింది.

క్వశ్చన్ పేపర్‌‌ కొట్టేద్దామని
దీపేందర్‌‌ పంజాబ్‌లోని ముక్త్​సర్‌‌లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు. ప్రతీసారి ఫెయిల్‌ అయ్యేవాడు. ఎనిమిదో తరగతి పరీక్షలు రాసేటప్పుడు  టీచర్ జవాబులు చెప్పి రాయిస్తే క్లాస్‌లో మూడో ర్యాంక్ వచ్చింది. ఆ తరువాత రాసే పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అవుతానో అని క్వశ్చన్ పేపర్లు దొరుకుతాయేమో అని ‌జిరాక్స్ దుకాణాల చుట్టూ తిరిగాడు. ఎక్కడా క్వశ్చన్ పేపర్లు దొరకలేదు. దాంతో పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ‘ఇంట్లో నా పని అయిపోయింది’ అనుకున్నాడు. కానీ.. ఫెయిల్​ అయ్యాడని తెలిసి కూడా ఇంట్లో వాళ్లు దీపేందర్​ను ఏమీ అనలేదు. పైగా ‘ఏం కాదులే. తరువాత పరీక్షల్లో చూసుకుందువు’ అని సర్దిచెప్పారు. అప్పుడే ‘నా మీద వీళ్లకు ఇంత నమ్మకం ఉంది. దాన్ని ఎలా అయినా నిజం చేయాలి’ అనుకున్నాడు. అప్పటినుండి కష్టపడి చదివాడు. ఐఐటి (ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) ఢిల్లీలో సీట్‌ సంపాదించాడు.


ఆలోచన వచ్చింది ఇలా...
అక్కడ చదువుతున్నప్పుడే పంకజ్‌ చందాతో ఫ్రెండ్‌షిప్ కుదిరింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇద్దరూ కలిసి ఢిల్లీలోని ‘బెయిన్‌ అండ్ కంపెనీ’లో సాఫ్ట్​వేర్‌‌ అనలిస్ట్​గా పనిచేశారు. వాళ్ల కో–వర్కర్స్ లంచ్‌ టైంలో ఫుడ్ ఆర్డర్‌‌ చేయాలంటే క్యాంటిన్‌ ముందు అరగంటసేపు లైన్‌లో నిలబడాల్సి రావడం, అక్కడే ఎక్కువ టైం వేస్ట్‌ అవడం గమనించాడు దీపేందర్​. ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఆలోచించారు  ఇద్దరు ఫ్రెండ్స్​. 

ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఫుడీబే. దీన్ని మొదట  వెబ్‌సైట్‌గా మొదలుపెట్టారు. దాంట్లో కంపెనీ రెస్టారెంట్‌లోని మెనూ కార్డ్​ను స్కాన్ చేసి పెట్టారు. దాన్నుండి ఆర్డర్‌‌ పెడితే ఫుడ్‌ తయారుచేసి పెట్టేవాళ్లు హోటల్‌ వాళ్లు. మొదట ఇది వాళ్ల కంపెనీ వాళ్లకే అందుబాటులో ఉండేది. తరువాత మిగతా కంపెనీలకు విస్తరించారు. ఇది అందరికీ నచ్చడంతో కొద్దిరోజుల్లోనే బాగా పాపులర్ అయింది. తరువాత ఈ సర్వీస్​నే ఒక బిజినెస్‌గా చేసి ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైల్లో లాంచ్‌ చేశారు. అక్కడ ఉన్న రెస్టారెంట్‌లను కలిసి బిజినెస్‌ గురించి చెప్పి, వాళ్ల మెనూ కార్డ్​లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. తరువాత అడ్వర్టైజ్‌ చేశారు.

ఈ ఐడియా అందరికీ నచ్చి కేవలం తొమ్మిది నెలల్లోనే బాగా పాపులర్ అయింది. తరవాత ఫుడీబే పదం ఈజీబేకి దగ్గరగా ఉండటంతో జనవరి 8, 2010న జొమాటోగా మార్చేశారు. అదే టైంలో స్మార్ట్‌ ఫోన్స్​ వాడకం పెరగడంతో వెబ్‌సైట్‌ను యాప్‌గా తయారుచేశారు. దీన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్‌ చేయడానికి డబ్బు కావాలి. అందుకని ఇన్వెస్టర్‌‌లను వెతకడం మొదలుపెట్టారు. 

ఫండ్ కలెక్షన్‌
మొదట ఈ కాన్సెప్ట్​ను ‘ఇన్‌ఫో ఎడ్జ్‌’ ఫౌండర్‌‌ ‘సంజీవ్‌ బిక్‌చందాని’కి చెప్పారు. ఈ ఐడియా బాగా నచ్చి సంజీవ్‌ 2010లో ఇందులో 4.7 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇన్‌ఫో ఎడ్జ్‌ జొమాటోలో 15.23 శాతం షేర్ హోల్డర్ అయింది. సంజీవ్‌ ఒక్కడే కాదు ఇందులో చాలామంది ఇన్వెస్ట్‌ చేశారు. ఇప్పడు జొమాటో మొత్తం నెట్‌వర్త్‌ 250 మిలియన్ డాలర్స్‌. 

ఒక్క ఇండియాలోనే కాదు
ఫుడ్‌ ఆర్డర్‌‌ ఇచ్చిన అరగంటలో ఇంటికి డెలివరీ ఇచ్చే జొమాటో యాప్‌ మనదేశంతో పాటు శ్రీలంక, దక్షిణాఫ్రికా, యుఎఇ, యుకె, ఖతార్‌‌, ఫిలిప్పీన్స్‌, న్యూజిలాండ్‌లతో కలిపి మొత్తం 24 దేశాల్లో ప్రారంభమైంది.  అన్ని దేశాల్లో కలిపి జొమాటో బ్రాండ్ వాల్యూ ఒక బిలియన్‌ యూఎస్‌ డాలర్స్‌.

లాభం వెనక రహస్యం ఇదే
జొమాటో ప్రారంభించినప్పటి నుండి లాభాల పంటేం పండలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి నష్టాల్లో కూరుకుపోయే వాళ్లు. మొదట్లో కస్టమర్లు రాక ఇబ్బంది పడ్డారు. తరువాత 2015వ సంవత్సరంలో 590 కోట్ల నష్టాన్ని, 2017లో 389 కోట్ల నష్టాన్ని భర్తీ చేసి నష్టాలనుండి గట్టెక్కింది. 2019 కొవిడ్‌ అప్పుడు పది శాతం ఉద్యోగులను, రెస్టారెంట్లని కోల్పోయింది. తరువాత లెక్కలేనన్ని ట్రోల్స్‌, సోషల్‌ మిస్‌ యూజెస్‌ నుంచి గట్టెక్కింది. 
ఇలా ఎన్నో నష్టాలను తట్టుకొని లాభాల బాటపట్టింది. అదెలాగంటే... జొమాటో ముఖ్యంగా నాలుగు బిజినెస్‌ మోడల్స్​ ఫాలో అవుతోంది. అందులో మొదటిది డెలివరీ బిజినెస్ మోడల్. ఇందులో ఇద్దరు డెలివరీ పార్ట్​నర్‌‌లు జొమాటోతో టై అప్ అవుతారు. ఒకరు రెస్టారెంట్ పార్ట్​నర్, ఇంకొకరు డెలివరీ పార్ట్​నర్‌‌. జొమాటో యాప్‌లో ఏదైనా రెస్టారెంట్‌ మెంబర్ కావాలంటే నెల లేదా సంవత్సరానికి కొంచెం డబ్బు కట్టాలి. రెస్టారెంట్ వాళ్లు డబ్బు ఎందుకు కట్టాలి అనే డౌట్​ రావచ్చు. కస్టమర్ హోటల్‌కు వెళ్లి తినాలంటే... దానికి టేబుల్‌, లైటింగ్‌, ఏసీ కావాలి. ఫుడ్‌ సర్వ్‌ చేయడానికి ఒక వెయిటర్ కావాలి. వచ్చిన కస్టమర్ తిని వెళ్లే వరకు ఆ టేబుల్‌ ఆక్యుపైడ్​గా ఉంటుంది. దానివల్ల బిజినెస్​ తక్కువ మందికి చేరుతుంది. అదే జొమాటోతో డెలివరీ చేస్తే... రెస్టారెంట్‌లో వంద రూపాయలు అయ్యే ఖర్చు కాస్తా ఆన్‌లైన్ డెలివరీ వల్ల 80 రూపాయలు అవుతుంది. దానివల్ల రెస్టారెంట్​కు ప్రాఫిట్‌. ట్యాక్స్​లా వచ్చిన డబ్బు గవర్నమెంట్‌కు కట్టి, డెలివరీ ఛార్జెస్‌ను సాలరీగా ఇస్తుంది జొమాటో. రెండవది అడ్వర్టైజింగ్‌. యాప్ ఓపెన్  చేసినపుడు కొన్ని రెస్టారెంట్స్‌ పేర్లు ముందు కనపడతాయి. అందుకు కూడా రెస్టారెంట్స్ కొంత డబ్బు కడతాయి. డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల హోటల్ ముందు వరుసలో కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఇస్తే యాప్‌లో విడిగా పోస్టర్ కూడా పెడతారు. అందుకు సంబంధించిన ఆల్గారిథమ్‌ వాడుతుంది జొమాటో యాప్‌. ఇంకోటి డైనింగ్‌ ఔట్‌ బిజినెస్‌. దీంతో కూడా సంపాదిస్తోంది జొమాటో. జొమాటో యాప్ వాడి హోటల్‌లో సీట్ బుక్ చేస్తే దానికి హోటల్ వాళ్లు జొమాటోకి కొంత డబ్బు కట్టాలి. రైతుల నుండి సరుకులు, కూరగాయలు డైరెక్ట్​గా కొని రెస్టారెంట్స్​కు సప్లై చేస్తోంది. అందులో కూడా ప్రాఫిట్ ఉంటుంది. దీన్నే బి2బి సప్లై బిజినెస్ అంటారు. జొమాటో ప్రోతో నెల లేదా సంవత్సరానికి డబ్బు కడితే... ఫ్రీ డెలివరీ, అప్పుడప్పుడు బై వన్ గెట్‌ వన్ ఆఫర్​లు ఉంటాయి. ఇవే కాదు మనం యాప్ వాడుతుంటే ‘మనకు ఏ ఫుడ్‌ ఇష్టం. ఏ రోజు... ఏం తింటాం’ అనే మన డాటాను  గవర్నమెంట్‌ టర్మ్స్‌ అండ్ కండీషన్స్​కు లోబడి స్టోర్ చేసుకుంటుంది జొమాటో. దాన్ని అవసరమైన ఇతర ఫుడ్‌ కంపెనీలకు అమ్ముతుంది. ఇలా కూడా వాళ్లు డబ్బు సంపాదిస్తున్నారు.