ఎవడి అయ్య కూడా నన్ను అరెస్ట్ చేయలేడు

ఎవడి అయ్య కూడా నన్ను అరెస్ట్ చేయలేడు

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అల్లోపతి మందులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాందేవ్ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రూ.1,000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో రాందేవ్ మాట్లాడిన మరో వీడియో నెట్‌‌లో హల్‌చల్ చేస్తోంది. తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ రాందేవ్ చాలెంజ్ చేయడంపై దుమారం రేగుతోంది. 

సోషల్ మీడియాలో అరెస్ట్ రాందేవ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవడంపై స్పందనగా మాట్లాడుతూ రాందేవ్ పైవ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ల తండ్రి కూడా నన్ను అరెస్ట్ చేయలేడు. థగ్ రాందేవ్, మహాథగ్ రాందేవ్, గిరఫ్తార్ (అరెస్ట్) రాందేవ్ అంటూ వాళ్లు కొన్ని ట్యాగ్స్‌‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ క్విక్ అరెస్ట్ రాందేవ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ల పని వాళ్లను చేయనిద్దాం. అయినా ఇలాంటి ట్రెండ్స్‌‌లోనూ మేం టాప్‌లోనే ఉన్నాం’ అని ఆ వీడియోలో రాందేవ్ అనడాన్ని చూడొచ్చు.