మన జవాన్లను కించపరిచిన రాహుల్​ను వెలి వేయాలె : బీజేపీ

మన జవాన్లను కించపరిచిన రాహుల్​ను వెలి వేయాలె : బీజేపీ
  • మన జవాన్లను చైనా సోల్జర్లు కొడ్తున్నారనడంపై బీజేపీ ఫైర్ 
  • దేశానికి, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడటంపై విమర్శలు

న్యూఢిల్లీ:  అరుణాచల్ ప్రదేశ్ లో మన ఆర్మీ జవాన్లను చైనీస్ సోల్జర్లు కొడుతున్నారంటూ దేశానికి, ఆర్మీకి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు శనివారం ఫైర్ అయ్యారు. రాహుల్ ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది రాహుల్ దేశభక్తిపై ప్రశ్నను లేవనెత్తుతోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ను కూడా ఆయన ప్రశ్నించారు. ఇది ఆయన మానసిక దివాళాకోరుతనాన్ని తెలియజేస్తోంది” అని బీజేపీ చీఫ్​జేపీ నడ్డా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ నుంచి ఫండ్స్ కూడా అందుకున్నది. అందుకే రాహుల్ ఎప్పుడూ చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతుంటారు’’ అని ఆరోపించారు. ఒక పక్క డోక్లాంలో మన సైనికులు చైనాతో పోరాడుతుంటే.. మరోపక్క అదే సమయంలో ఢిల్లీలో చైనీస్ అధికారులతో కలిసి రాహుల్ సూప్ తాగారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మండిపడ్డారు.  

మనోళ్లే కొట్టి, తరిమేశారు.. 

కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే నిజంగా రిమోట్ కంట్రోల్డ్ లీడర్ కాకపోతే, ఆ పార్టీ దేశానికి మద్దతుగా నిలబడితే.. ఇండియాను తక్కువ చేస్తూ, సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రాహుల్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ హయాంలో ఒక్క ఇంచ్ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోకుండా చూశామని, కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 43,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని స్వయంగా ప్రభుత్వమే చెప్పిందన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకే కాదు.. మొత్తం దేశానికే సమస్యగా తయారయ్యారని మరో మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.  

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

జోడో యాత్ర సందర్భంగా శుక్రవారం జైపూర్​లో మీడియాతో రాహుల్ మాట్లాడారు. చైనా యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా.. కేంద్రం రాబోయే ముప్పును పట్టించుకోవట్లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఒప్పుకోకుండా కేంద్రం నిద్రపోతోందని విమర్శించారు. అరుణాచల్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనీస్, ఇండియన్ సోల్జర్ల మధ్య గొడవను ప్రస్తావిస్తూ.. అరుణాచల్ లో మన జవాన్లను చైనీస్ సోల్జర్లు కొడుతున్నారని కామెంట్ చేశారు.