
- దిగ్గజ సంస్థలకు ఆర్ అండ్ డీ సేవలను అందించడం తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనం: కేటీఆర్
- ఇంగ్లండ్‌లో వార్విక్ యూనివర్సిటీలో పీడీఎస్‌ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభం.
హైదరాబాద్, వెలుగు: దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం గర్వకారణంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానమన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని ఆకాంక్షించారు. శనివారం ఇంగ్లండ్‌లో వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ (ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్) నాలెడ్జ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. పీడీఎస్‌ఎల్ తమ కార్యకలాపాలను తెలంగాణలోనూ విస్తరించాలని కోరారు.
మెక్ లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్ అండ్ డీ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ.. వార్విక్ యూనివర్సిటీలో నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించడం తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న వినూత్న విధానాలతోనే చెన్నై, పుణెలకు దీటుగా ఆటోమోటివ్ హబ్‌గా హైదరాబాద్ నిలిచిందన్నారు. తమ హయాంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఆటోమోటివ్ రంగంలో తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఆర్ అండ్ డీకే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు ఉపయోగపడతాయని చెప్పారు.
ఫార్ములా ఈను సక్సెస్ చేసినం..
దేశంలో తొలిసారిగా ఫార్ములా ఈ రేసును నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడమేకాకుండా.. మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ రేసును నిర్వహించామని తెలిపారు. తమ ప్రభుత్వ కృషితో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్‌లో అతిపెద్ద ఆఫీసులను ప్రారంభించాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థులతో పాటు కంపెనీలు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కాగా.. కేటీఆర్ ఆలోచనలు, పనితీరు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని పీడీఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల అన్నారు.