ఎల్‌నినో పేరు చెప్పి మోసగిస్తున్న కాంగ్రెస్ : హరీశ్ రావు 

ఎల్‌నినో పేరు చెప్పి మోసగిస్తున్న కాంగ్రెస్ : హరీశ్ రావు 
  • నీళ్లను చంద్రబాబుకు గురు దక్షిణగా చెల్లిస్తున్నవా? 
  • సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

నాగర్‌‌కర్నూల్ టౌన్, వెలుగు : ఎల్‌నినో పేరు చెప్పి రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు.  ఇది ఎల్​నినో వల్ల వచ్చిన కరువు కాదని,  కాంగ్రెస్  తెచ్చిన కరువని విమర్శించారు. బుధవారం ఆయన నాగర్ కర్నూల్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 96 టీఎంసీల నీళ్లు ఉన్నా కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని రాష్ట్ర సర్కారును ప్రశ్నించారు.

"నీళ్లు లేక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక రాష్ట్రానికి కరువు వచ్చింది. ఏపీలో ఎక్కడా క్రాప్ హాలిడే లేదు. తెలంగాణలో మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌లో 5 మోటార్లు ఉంటే ఒకటి, రెండు మాత్రమే నడిపారు. మేం ఒత్తిడి తెచ్చిన తర్వాతే మూడు నడుపుతున్నారు. పైగా మోటార్లను కేవలం 8 గంటలే నడుపుతున్నారు. శ్రీశైలంలో నిండా నీళ్లున్నాయి.

హక్కులు లేకున్నా.. బేసిన్ కాకున్నా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లు తరలించుకుపోతున్నాడు. కానీ, పక్కనే ఉన్న పొలాలకు నీళ్లు ఇవ్వడం కూడా  రేవంత్ రెడ్డికి చేతకావడంలేదు. నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా చెల్లిస్తున్నావా? " అని సీఎంను హరీశ్ నిలదీశారు. 

మంత్రి ఉత్తమ్ చేసిందేం లేదు

బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే కల్వకుర్తి పంపుల పనులు పూర్తయ్యాయని హరీశ్ తెలిపారు.  భీమా, నెట్టెంపాడు, కోయిల సాగర్, కల్వకుర్తి లాంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినట్లు గుర్తుచేశారు. తాము రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ ఉన్న నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ మీద పడి ఏడ్వడం తప్ప మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందేం లేదని మండిపడ్డారు. మూడేళ్లలో ఉత్తమ్ ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని.. అయినా గడిచిన మూడేళ్లలో 21 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు అబద్ధం చెప్పారన్నారు. కొత్తగా రెండు లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని వెల్లడించారు. శ్రీశైలంలో 88 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్టు ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని.. కానీ 8.8 టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేశారని హరీశ్ పేర్కొన్నారు.

కాగా..కొల్లాపూర్ మండలం సింగోటంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని హరీశ్ రావు బుధవారం పరామర్శించారు. హర్షవర్ధన్ రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. లక్ష్మారెడ్డి చిత్రపటానికి హరీశ్ పూలమాల వేసి నివాళులర్పించారు.