Hyderabad Women U19 Team: హైదరాబాద్ మీర్‌పేట్ ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ అక్కి ఆశ్రిత గౌడ్ మంచి అవకాశం దక్కించుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరగనున్న U-19 మహిళల టీ20 పోటీల కోసం హైదరాబాద్ జట్టులో ఈమె స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్ U-19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతోఆశ్రిత కుటుంబ సభ్యులు, కోచ్‌లు, స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చిన్ననాటి కల.. కఠోర శ్రమ:
చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఎనలేని మక్కువ పెంచుకున్న ఆశ్రిత గౌడ్, మైదానంలో నిరంతర సాధన, కఠోర శ్రమ, క్రమశిక్షణతో తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ వచ్చింది. అలాగే లోకల్, జిల్లా స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగిన ఆశ్రిత, తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ఆశ్రిత తన ఎంపికతో నిరూపించింది.
ALSO READ : ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు
మీర్‌పేట్‌కు దక్కిన గౌరవం:
ఆశ్రిత హైదరాబాద్ జట్టుకు ఎంపికైన విషయం తెలియగానే మీర్‌పేట్‌లోని ఆమె నివాసం దగ్గర కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు వేడుకలు చేసుకున్నారు. మహిళా క్రికెట్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణతో ఆశ్రిత సాధించిన ఈ విజయం మీర్‌పేట్ ప్రాంతానికే గర్వకారణంగా మారింది. అయితే క్రీడల్లో రాణించాలనుకునే స్థానిక యువతులకు, బాలికలకు ఆశ్రిత ప్రయాణం ఎంతో స్ఫూర్తినిస్తుందని క్రీడాభిమానులు కొనియాడారు. రాబోయే టీ20 మ్యాచ్‌లలో ఆశ్రిత బాగా ఆడి హైదరాబాద్ జట్టుకు మంచి విజయాలు అందించాలని స్థానికులు ఆకాంక్షించారు.
