హుజురాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్ష బీభత్సం

హుజురాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్ష బీభత్సం

హుజురాబాద్‌: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గాంధీనగర్‌లో పైడాకుల సురేష్ ఇంటిపై పిడుగు పడటంతో ఆయన ఇంట్లోని వస్తువులతో పాటు చుట్టుపక్కల మరో 20 ఇళ్లలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పూర్తిగా కాలిపోయాయి.

విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని, ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

శంకరపట్నం మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి అరకండ్ల వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. వాగు ఉధృతికి శంకరపట్నం, చల్లూరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి మట్టం తగ్గేవరకు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.