హర్యానాలోని మనేసర్‌లో మారుతి సుజుకి సంస్థ దాని తయారీ కేంద్రంలో 300 కిలోవాట్ల పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఈ ప్లాంట్‌లో తయారుచేసే గ్రీన్ హైడ్రోజన్‌ను నేచురల్ గ్యాస్ తో కలిపి, కార్ల తయారీ ప్రాసెస్‌లో ఇంధనంగా ఉపయోగిస్తారు. అయితే ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఈ సిస్టమ్ దోహదపడుతుంది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే అనుభవాలతో హర్యానా, గుజరాత్‌లోని మిగతా అన్ని తయారీ కేంద్రాల్లోకి కూడా ఈ 'గ్రీన్ హైడ్రోజన్' సాంకేతికతను విస్తరించాలని మారుతి యోచిస్తోంది.
కంపెనీ సూత్రం ఏంటంటే
సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన తత్వమైన 'షో-షో-కే-టాన్-బి' (అంటే చిన్నది, తక్కువ, తేలికైనది, పొట్టిది ఇంకా మరింత అందమైనది) నుండి స్ఫూర్తి పొంది, వనరులను పొదుపుగా వాడుతూ ఇంధన అవసరాలను ఆప్టిమైజ్ చేస్తూనే ఉన్నామని మారుతి సుజుకి తెలిపింది.
కంపెనీ ఎండీ & సీఈఓ ఏమన్నారంటే
"కార్ల తయారీలో వివిధ రకాల పర్యావరణ రహిత మార్గాలను అనుసరిస్తున్నట్లే, ఇంధనం కోసం కూడా స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధన మార్గాలను ఎంచుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'గ్రీన్ హైడ్రోజన్ మిషన్'కు మద్దతుగా ఈ ప్లాంట్‌ను ప్రారంభించాం." అని అన్నారు.
అలాగే "సోలార్, బయోగ్యాస్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా పర్యావరణానికి మేలు చేసే సాంకేతికతలను పెంచుతున్నాం. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి మా తయారీ కేంద్రాల నుండి వెలువడే కార్బన్ ఉద్గారాలను ప్రస్తుత 6,15,000 టన్నుల నుండి 2,66,000 టన్నులకు తగ్గించడమే మా లక్ష్యం." అని చెప్పారు.
ALSO READ : అక్టోబర్ 2న "No UPI Day"
త్వరలో మరో బయోగ్యాస్ ప్లాంట్
దీనికి తోడు, హర్యానాలోని ఖర్ఖోడా ప్లాంట్‌లో రోజుకు 20 టన్నుల (TPD) సామర్థ్యం గల 'బయోగ్యాస్ ప్లాంట్' ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఇది 2026-27 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని మారుతి సుజుకి స్పష్టం చేసింది.
