గణపతి నిమజ్జనం పూజా విధానం.. స్వామివారికి ఉద్వాసన ఎలా చెప్పాలి.. గంగమ్మ ఒడికి ఎలా చేర్చాలి

గణపతి నిమజ్జనం పూజా విధానం.. స్వామివారికి ఉద్వాసన ఎలా చెప్పాలి.. గంగమ్మ ఒడికి ఎలా చేర్చాలి

 హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని అనంత చతుర్ధశి రోజున వినాయక విగ్రహాలను సమీపంలోని నదులు, చెరువు లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ముందు చేసే పూజ, పీఠ కదిపే విధానం, గణేష్ నిమజ్జనం ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం.. 

దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.  తొమ్మిదిరోజులు శ్రద్దగా పూజించిన భక్తులు...   గణేష్  విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు రడీ అయ్యారు.  డప్పులు, మేళ తాళాలకు, అంగు, ఆర్భాటానికి  ఇచ్చిన ప్రాధాన్యత నిమజ్జన పూజా విధానానికి ఇవ్వడం లేదు.  గణేష్ నిమజ్జనానికి కూడా ప్రత్యేకమైన పూజ ఉందని పండితులు చెబుతున్నారు.  

గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాల్లో, వివిధ కూడళ్లలో, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో, అపార్ట్ మెంట్ లలో వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించారు.  వినాయకుని మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి.

 మన దేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఈ ఏడాది (2026) సెప్టెంబర్​ 25న  ఘనంగా నిమజ్జన వేడుకలు నిర్వహించేందుకు ఇటు భక్తులు.. అటు అధికార యంత్రాంగం రడీ అయింది.  ఇప్పటికే హైదరాబాద్​ లో బడా గణేష్​ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉద్వాసన పూజ ఇలా...

  • వినాయక మండపంలో గణనాధుడిని కదిలించడానికి ముందు ఉధ్వాసన పూజ చేయాలి. 
  • యధాస్థానం ప్రవేశయామి ..పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉధ్వాసన పలకాలి. 
  • దీని అర్ధం స్వామి.. నీ స్వస్థలానికి వెళ్లి .. మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్ధం. 
  •  పూలు, పండ్లు, కొత్త బట్టలు, మోదక లడ్డూలను బొజ్జ గణపయ్య ముందు ఉంచాలి. 
  • హారతి ఇచ్చి నైవేద్యాన్ని అందరికీ పంపిణీ చేయాలి. 
  •  ఒక తెల్లని వస్త్రం (గుడ్డ) లో అయిదు రకాల పండ్లను, పువ్వులను, మోదకం, తమలపాకులతో పాటు ఇతర వస్తువులను కట్టి గణనాధుడి విగ్రహం వద్ద ఉంచాలి. 
  • పత్రిలోని అయిదు ఆకులను తీసుకుని వాటికి పసుపు రాసి దారంతో కంకణం చేసుకుని కుడి చేయికి కట్టుకోవాలి. 
  • ఆ తర్వాత రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్వామి వారిని స్మరించుకోవాలి. నవరాత్రుల వేళ తాము ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి.
  •  అయిదు సార్లు లేదా తొమ్మిది సార్లు గుంజిళ్లు తీయాలి. 

మండపంలోని గణపతి విగ్రహాన్ని కదలించడానికి ముందు గణపతి బప్పా మోరియా..జే బోలో గణేష్ మహారాజ్ అనే నినాదాలు చేయాలి. అనంతరం నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తూ స్వామివారిని తరలించాలి. నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాలను పఠించాలి.

యంతు దేవగణః సర్వే పూజామాదయ మోమ్కీం.
ఇష్టకామసమృద్దర్థం పునరపి పునరాగమనా చ ||
గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానే పరమేశ్వర
మమ పూజా గ్రహీత్మేవం పునరాగమనాయ చ||

వినాయకుడి ఏదైనా నది, చెరువు, సముద్రం ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా గణనాధుడి విగ్రహానికి పూజారులు చెప్పిన పద్ధతిలో పూజ చేయాలి. వినాయకుడికి సంబంధించిన వస్తువులన్నింటినీ నీటిలో నిమజ్జనం చేయాలి. ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా నీటిలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేయాలి. అనంతరం స్వామివారిని తలుచుకుంటూ నమస్కారం చేయాలి. వచ్చే ఏడాది కూడా తమ కాలనీకి, ఇంటికి రావాలని కోరుకోవాలి.

నిమజ్జనంలో చేయకూడనివి

గణనాధుడిని విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడికి సంబంధించిన వస్తువులు విసిరివేయకూడదు. వినాయకుడిని బొర్లా (వెనుక వైపు) నుండి నీటిలో ముంచకూడదు. కేవలం ముందు బాగం నుంచి మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. నీటిలో దిగే సమయంలో కింద విగ్రహాలను కాళ్లతో తొక్కకుండా జాగ్రత్త లు పాటించాలి..