- దళిత సమాజాన్ని అవమానించడమేనన్న అధికార పార్టీ
- తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నిరసన
- ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇస్తామన్న చైర్మన్ గుత్తా
- వాడీవేడీగా శాసనమండలి సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యల అంశం మంగళవారం శాసనమండలిలో తీవ్ర దుమారానికి దారితీసింది. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేశారు. మరోవైపు స్పీకర్‌ను దూషించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ఇది దళిత సమాజాన్ని అవమానించడమేనంటూ మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, దామోదర్ రాజనర్సింహతో పాటు అధికార పార్టీ సభ్యులు మహేశ్‌కుమార్‌గౌడ్, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, ఏవీఎన్ రెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, అధికార పార్టీ సభ్యుల విమర్శలతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మంగళవారం శాసనమండలి సమావేశం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. సోమవారం అసెంబ్లీ బయట ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చైర్మన్ సభకు తెలిపారు. అయితే అరెస్టు చేసిన ఇద్దరు సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదన్నారు. మహిళలు, దళితులు, గిరిజనులపై బీఆర్ఎస్ వ్యవహారశైలి సరైనది కాదన్నారు.
ఘటనపై విచారణ జరుపుతాం..
సోమవారం జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. సభకు ప్లకార్డులు తీసుకురావడం, దుస్తులపై నినాదాలు రాసుకుని రావద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులపై దాడి, దురుసు ప్రవర్తన ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష, పాటించాల్సిన సభా మర్యాదలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం: మంత్రి దామోదర్
దళితుల చరిత్ర పోరాటాలు, ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. తరతరాలుగా వివక్ష, అవమానాలను ఎదుర్కొంటూ పోరాడి, రాజ్యాంగం కల్పించిన హక్కులతో దళితులు ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు తమను భయపెట్టబోవని, మరింత బలంగా, ఆత్మగౌరవంతో ముందుకు సాగేలా చేస్తాయని స్పష్టం చేశారు.
సభలో హుందాగా వ్యవహరించాలి: మంత్రి శ్రీహరి
ఈ సభ అందరిదని, సభ్యులు హుందాగా వ్యవహరించాలని, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని పేర్కొన్నారు.
దళితులపై చిన్నచూపెందుకు?: అద్దంకి దయాకర్
చట్టసభల గౌరవాన్ని కాపాడాలని కాంగ్రెస్ సభ్యుడు అద్దంకి దయాకర్ కోరారు. దళితులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష సభ్యులను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్న ఘటనలను ప్రస్తావించారు. తాతా మధు వ్యాఖ్యల వెనుక ఉన్న ఆలోచనా విధానంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దళిత సమాజాన్ని అవమానించిన్రు: తీన్మార్ మల్లన్న
సోమవారం జరిగిన ఘటనపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను అవమానించడం అంటే కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, అది దళిత సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. దళిత వ్యక్తి ఉన్నత పదవిలో ఉండడాన్ని సహించలేని ధోరణి
కనిపిస్తోందని విమర్శించారు.
సంయమనంతో వ్యవహరించాలి: కోదండరాం
స్పీకర్‌పై అనుచిత పదజాలం ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునే అంశమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి, చట్టసభల గౌరవానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై శాసనసభలో సమగ్రంగా చర్చించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ గొడవతో సభ వాయిదా..
బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉదయం 10.15 గంటలకు సభను అర గంట పాటు వాయిదా వేశారు. తిరిగి 11 గంటలకు సమావేశం ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ పక్ష నాయకుడు మధుసూదనాచారి మాట్లాడుతూ తాతా మధు, నవీన్కుమార్రెడ్డిలకు తమ వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. వారిని ఏకపక్షంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సభ్యులు దాసోజు శ్రావణ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు సభలో నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.
‘పోలీసుల గుండాయిజం నశించాలి’ అంటూ నినాదాలు చేయడంపై చైర్మన్ ఘాటుగా స్పందించారు. పోలీసు భద్రత అవసరం లేదని భావిస్తే దానిని తొలగించాలని సిఫారసు చేయాలా? అని వారిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, అధికార పార్టీ సభ్యుల విమర్శలతో మంగళవారం శాసనమండలి సమావేశం వాడీవేడిగా సాగింది.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తం: మంత్రి సీతక్క
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. మహిళా పోలీసుల పట్ల కొందరు బీఆర్ఎస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని విమర్శించారు. దీనిపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా వ్యవహరించినా చర్యలు తీసుకోవాల్సిందేన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.
