సంచార జాతుల పిల్లలకు స్పెషల్ స్కూల్.. 

సంచార జాతుల పిల్లలకు స్పెషల్ స్కూల్.. 
  • దాతల సహకారంతో సమకూర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: పేద విద్యార్థుల చదువుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని షాద్​నగర్​ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. విద్యా రంగానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్​మండలం హాజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిండికేట్ కాలనీలో సంచార జాతుల పిల్లల కోసం నిర్మించతలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఇప్పటికే దాతల సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే.. ప్రస్తుత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కూడా దాతల సహకారంతోనే నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో ఓ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ లేకపోవడంతో పిల్లలు  చదువుకు దూరంగా ఉంటున్నారని వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసిందన్నారు. అందరికీ చదువు అందించాలన్న బాధ్యతతో వెంటనే స్పందించి దాతల సహకారంతో పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాతలు ముందుకొచ్చి పేద పిల్లల విద్యకు అండగా నిలవడం అభినందనీయమన్నారు.