- ఆలుగడ్డలతో చేసే లాట్వియన్ కర్తుపెయు పంకుకాస్కు అగ్రస్థానం
- అంతర్జాతీయ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ తాజా జాబితా విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ పాన్‌కేక్స్ తాజా జాబితాలో మన భారతీయ వంటకాలు సత్తాచాటాయి. సాధారణంగా పెనంపై వేయించే, తీపి రుచితో ఉండే విదేశీ వంటకాలను పాన్‌కేక్ లుగా పరిగణిస్తారు. అయితే, మన దోశలు, అప్పంలు కూడా ఆ కోవలోకే వస్తాయని టేస్ట్ అట్లాస్ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 11 భారతీయ వంటకాలకు చోటు కల్పించింది. ఇక ఆలుగడ్డలతో చేసే లాట్వియన్ కర్తుపెయు పంకుకాస్ కు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది.
ఆ తర్వాత వరుసలో ఫ్రాన్స్ కు చెందిన మూడు వంటకాలు, చైనాకు చెందిన మరో వంటకం ఉన్నాయి. కాగా, టేస్ట్ అట్లాస్ తన 2026 నివేదికలో ఇప్పటికే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, లక్నో వంటి నగరాలను ప్రపంచ ఆహార చిత్రపటంలో చేర్చింది. ఇప్పుడు 11 వంటకాలతో మన దేశీ రుచులు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశాయి. పిండిని రాత్రంతా పులియబెట్టడం వల్ల వచ్చే ప్రత్యేకమైన పులుపు రుచి మన దోశల సొంతం. ప్రపంచమంతా పాన్‌కేక్స్‌ను మేపుల్ సిరప్‌తో తింటే, మనం మాత్రం సాంబార్, రకరకాల చట్నీలతో కలిపి ఆస్వాదిస్తాం. ఆంధ్రా పెసరట్టు నుంచి కేరళ అప్పం వరకు ఇవన్నీ వాటికవే సాటిగా నిలుస్తాయని టేస్ట్ అట్లాస్ పేర్కొంది.
- వరల్డ్ టాప్ 5లో నిలిచినవి ఇవే..
1. కర్తుపెయు పంకుకాస్ (లాట్వియా): ఆలుగడ్డలతో చేసే ఈ పాన్ కేక్ మొదటి స్థానంలో నిలిచింది
2. క్రేప్స్ సుక్రేస్ (ఫ్రాన్స్): తీపి రుచితో ఉండే వంటకం
3. క్రేప్స్ (ఫ్రాన్స్): ఫ్రాన్స్‌కు చెందిన ఐకానిక్ వంటకం
4. నుటెల్లా క్రేప్స్ (ఫ్రాన్స్): చాక్లెట్ ఫ్లేవర్ డెజర్ట్
5. జియాన్‌బింగ్ (చైనా): తియాంజిన్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్
- ఇండియా నుంచి టాప్ 100లో నిలిచిన ఫుడ్, వాటి ర్యాంకులు..
ర్యాంకు వంటకం
6 మసాలా దోశ
15 దోశ (తమిళనాడు)
35 పేపర్ దోశ (తమిళనాడు)
60 అప్పం (కేరళ)
63 పెసరట్టు (ఆంధ్రప్రదేశ్)
74 ఉతప్పం (తమిళనాడు)
84 నీర్ దోశ (కర్నాటక)
85 మాల్పువా (ఈస్ట్ ఇండియా)
95 కల్లాప్పం (కేరళ)
96 రవ్వ దోశ (సౌత్ ఇండియా)
98 పిఠా (ఒడిశా)
