- టెక్ నుంచి లైఫ్ సైన్సెస్ దాకా దూకుడు
- టాలెంట్.. ఇన్‌ఫ్రా.. జీసీసీలతో ఎదుగుదల
- ‘జీనోమ్ వ్యాలీ’గా నగరానికి మరో ప్రత్యేకత
- గ్లోబల్ టెక్ మ్యాప్‌లో సిటీ స్థానం పదిలం
- 5 కోట్ల నుంచి 16కోట్ల ఫీట్లకు చేరిన వర్క్ స్పేస్
- బ్లూమ్‌బర్గ్ ప్రత్యేక వీడియో కథనం ప్రసారం
హైదరాబాద్, వెలుగు: మన భాగ్యనగరం గ్లోబల్ టెక్ మ్యాప్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది. దేశంలో టెక్నాలజీకి చిరునామాగా ఉన్న బెంగళూరుతో పోటీ పడే స్థాయిలో హైదరాబాద్ ఎదుగుతోందని అంతర్జాతీయ బిజినెస్ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్’ విశ్లేషించింది. ‘వై ఇండియాస్ బిగ్ టెక్ కంపెనీస్ ఆర్ బెట్టింగ్ ఆన్ హైదరాబాద్’ పేరుతో ప్రసారం చేసిన వీడియో కథనంలో హైదరాబాద్ దశాబ్దాలుగా నిర్మించుకున్న టాలెంట్, మౌలిక వసతులు, బిజినెస్ ఎకోసిస్టమ్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తున్న తీరును కథనంలో వివరించింది. అదే సమయంలో లైఫ్‌సైన్సెస్ రంగంలో నగరానికి ఉన్న ప్రత్యేకతలనూ ప్రస్తావించింది.
టెక్ దిగ్గజాల చూపు
హైదరాబాద్ ఎదుగుదల వెనుక అనేక కారణాలున్నాయని బ్లూమ్‌బర్గ్ స్పష్టం చేసింది. ఏళ్లుగా అభివృద్ధి చేసిన నైపుణ్యమున్న మానవ వనరులు, మౌలిక వసతులు, వ్యాపార వాతావరణం నగరానికి బలంగా మారాయని పేర్కొంది. ఈ ఎకోసిస్టమ్ కారణంగానే అంతర్జాతీయ టెక్ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని తెలిపింది. అమెజాన్, మెటా, యాపిల్ వంటి దిగ్గజాల రాకను కథనంలో వివరించింది. నగరంలో ఏర్పడిన భారీ ఆఫీస్ క్యాంపస్‌లు హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారుతున్న తీరుకు నిదర్శనంగా చూపించింది.
5 కోట్ల అడుగుల నుంచి 16 కోట్లకు వర్క్ స్పేస్
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ విస్తరణను కూడా బ్లూమ్‌బర్గ్ లెక్కలతో వివరించింది. దశాబ్దం క్రితం నగరంలో సుమారు 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉండగా.. ఇప్పుడు అది దాదాపు 160 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని నాలెడ్జ్ రియాల్టీ ట్రస్ట్ సీఈవో శిరీష్ గాడ్బోలే వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజం 'బ్లాక్‌స్టోన్' సహకారంతో ఏర్పాటైన 'సత్వ నాలెడ్జ్ సిటీ' వంటి అత్యాధునిక క్యాంపస్‌లలో దాదాపు 75 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని బ్లూమ్‌బర్గ్ వివరించింది.
ప్రపంచ మేటి కంపెనీలైన అమెజాన్, మెటా, ఆపిల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయని ఈ కథనం కొనియాడింది.
జీసీసీలు కీలకం
హైదరాబాద్ ఎదుగుదలలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కీలకంగా మారాయని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఒకప్పుడు కాల్‌సెంటర్లు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు పరిమితమైన కేంద్రాలు ఇప్పుడు మిడ్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ స్థాయి బాధ్యతల వైపు విస్తరిస్తున్నాయి. అంటే మాతృ సంస్థలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడమే కాకుండా టెక్నాలజీ, ఉత్పత్తి అభివృద్ధి, వ్యాపార వ్యూహాలు, ప్రపంచస్థాయి కార్యకలాపాల్లోనూ భాగస్వాములవుతున్నాయి. ఇదే మార్పు హైదరాబాద్‌ను సాధారణ ఐటీ సర్వీస్ కేంద్రం నుంచి గ్లోబల్ బిజినెస్ కార్యకలాపాల కేంద్రంగా మార్చుతోంది.
లైఫ్ సైన్సెస్ హబ్
హైదరాబాద్ బలం టెక్నాలజీకే పరిమితం కాదని బ్లూమ్‌బర్గ్ కథనం ప్రస్తావించింది. లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఫార్మా రంగాల్లోనూ నగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని పేర్కొంది. అందుకే హైదరాబాద్‌ను ‘జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారని వివరించింది. భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా కూడా హైదరాబాద్‌లో ఏర్పడిన లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టమ్ ప్రాధాన్యాన్ని ఇందులో వివరించారు.
1996 – 97లో తాము ఇక్కడికి వచ్చినప్పుడు కనీస రోడ్లు, విద్యుత్ సౌకర్యం కూడా లేవని కృష్ణ ఎల్లా అందులో పేర్కొన్నారు. ఎలాంటి ప్రభుత్వ అడ్డంకులు లేకుండా ప్రోత్సాహకర వాతావరణం కల్పించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు అవసరమైన సంస్థలు, మౌలిక వసతులు, నైపుణ్యం ఒకేచోట కలవడం ఈ రంగం ఎదుగుదలకు కీలకమని చెప్పారు.
ఏఐ విస్తరణతో చేంజ్
హైదరాబాద్ ఎదుగుదలకు కొత్త సవాలు కూడా ఉందని బ్లూమ్‌బర్గ్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు నగర టెక్ రంగం తక్కువ ఖర్చుతో ఐటీ సేవలు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలపై కొంత మేర ఆధారపడింది. ఏఐ విస్తరణతో ఇలాంటి రొటీన్ పనుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని కథనం పేర్కొంది. హైదరాబాద్ ప్రపంచ కంపెనీలకు సేవలు అందించే నగరంగానే కాకుండా విలువైన టెక్నాలజీ, ఇన్నోవేషన్, ప్రపంచస్థాయి వ్యాపార కార్యకలాపాల సృష్టి కేంద్రంగా ఎదగాలని బ్లూమ్‌బర్గ్ విశ్లేషణ సూచించింది.
