హైదరాబాద్, వెలుగు : చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను ట్రేస్ చేసేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈసందర్భంగా సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సిస్టమ్ వివరాలను మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సెల్‌ఫోన్‌ల చోరీ, మిస్సింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నదని తెలిపారు. ఇలాంటి సెల్‌ఫోన్‌లను గుర్తించేందుకు డిపార్ట్‌మెంట్‌లో సీఈఐఆర్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. ప్రపంచ టెలికాం దినోత్సవంగా మే 17న ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్‌లో ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. బాధితుల వివరాలను సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో టెలికాం డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్, డైరెక్టర్ మురళీ కృష్ణ, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవాలి
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం, మద్యం రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, విజిలెన్స్, సివిల్ సప్లై, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సెల్‌ఫోన్ పోతే ఇలా చేయాలి
- కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. మొబైల్ పోగొట్టున్న, చోరీకి గురైన వారు www.ceir.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
- ఇందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- సెల్‌ఫోన్ నంబర్, ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మోడల్, ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన బిల్లు అప్లోడ్ చేయాలి.
- మొబైల్ పోగొట్టుకున్న డేట్, టైమ్, స్టేట్, డిస్ట్రిక్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు ఎంటర్ చేయాలి.
- ఫోన్ కొన్న వ్యక్తి పేరు, అడ్రస్, ఐడీకార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఇదంతా ప్రాసెస్ పూర్తి చేశాక ఒక ఐడీ నంబర్ వస్తుంది. దీంతోనే ఫోన్ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- సెల్‌ఫోన్ ఏ కంపెనీది అయినా సరే సీఈఐఆర్ విధానంతో ఫోన్ బ్లాక్, అన్‌బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

