బషీర్బాగ్, వెలుగు: వక్ఫ్ బోర్డు స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. అబిడ్స్ బొగ్గులకుంటలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలాన్ని గతంలో లీజుకు ఇచ్చారు. ఈ స్థలంలో మయూరి పాన్ షాప్ , నర్సింగ్ పావ్ బాజీ వంటి పలు వ్యాపార సముదాయాలను నడుపుతున్నారు.
అయితే కామన్ పాసేజ్ స్థలంలో షాపు నిర్వాహకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని వక్ఫ్ బోర్డు అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు 2014లో న్యాయస్థాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో అక్రమ నిర్మాణాలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో గురువారం జీహెచ్ఎంసీ అధికారులు సుల్తాన్ బజార్ పోలీసుల బందోబస్త్ మధ్య వాటిని జేసీబీతో తొలగించారు. మరోసారి ఇలాంటి నిర్మాణాలు చేపడితే చర్యలు చేపడతామని హెచ్చరించారు.

