V6 News

సిటీలో ఏసీ బస్సులను బంద్ చేసి జిల్లాలకు నడుపుతున్న అధికారులు

సిటీలో ఏసీ బస్సులను బంద్ చేసి జిల్లాలకు నడుపుతున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో ఆర్టీసీ అధికారులు ఏసీ బస్సులను తిప్పడం లేదు. దీంతో ఎండలు భరించలేక ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏసీ బస్సులను అందుబాటులో ఉంచని ఆర్టీసీ అధికారుల తీరుపై ప్యాసింజర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో పుష్పక్ పేరుతో ఎయిర్ పోర్ట్ కు మాత్రమే ఏసీ బస్సులు నడుస్తున్నాయి. 

పట్టించుకోని అధికారులు

జేఎన్ ఎన్ యూఆర్ ఎం స్కీమ్ లో గతంలో సిటీలో 80 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు నడిపించారు. కానీ తర్వాత వాటిని జిల్లాలకు తిప్పుతున్నారు. అయితే జిల్లాలకు ఇప్పటికే రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సులు ఉండగా ఈ మెట్రో లగ్జరీ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. జిల్లాలకు నడుస్తున్న బస్సుల్లో కొన్నింటిని అయినా సిటీలో తిప్పాలని ప్యాసింజర్లు కోరుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో గత 3 నెలలుగా ఆర్టీసీ పెద్ద ఎత్తున జంట నగరాల్లో రెవెన్యూ లాస్ అవుతోంది. గ్రేటర్​నుంచే ఈ లాస్ ఎక్కువగా ఉండగా.. రెవెన్యూ పెంచుకునేందుకు ఆర్టీసీకి అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయని వాటిని తొలగించిన అధికారులు.. ఈ ఎండాకాలంలో అయినా వాటిని తిప్పితే ప్యాసింజర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది. 

ఫుల్ రష్​తో..

గ్రేటర్ లో మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నడిపిన టైమ్ ఫుల్ రద్దీతో నడిచాయి. ఉప్పల్– లింగంపల్లి, ఉప్పల్– వేవ్ రాక్ ( నానక్ రాం గూడ) , ఎల్​బీ నగర్– లింగంపల్లి రూట్లలో ప్యాసింజర్లు, ఐటీ ఉద్యోగులతో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు ఫుల్ రష్​తో నడిచాయి. వీటి పాస్ లకు కూడా ఫుల్ డిమాండ్ ఉండేది. ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్యాసింజర్లు కూడా పాస్ లు తీసుకోవటం, మెట్రో పాస్ కు కాంబినేషన్ టికెట్ తీసుకొని వీటిలో ప్రయాణించారు. ఏసీ ఉండటంతో అలసటకు గురికాకపోవటం, సీసీ కెమెరాలు ఉండటంతో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో ప్యాసింజర్లు ఈ బస్సులను ఆదరించారు. ఈ బస్సులను ఇప్పుడు తిప్పకపోవడంతో ఏసీ ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు జనం ఆసక్తి  చూపుతున్నారు. 

సెక్యూరిటీ ఉండేది

సిటీలో ఏసీ బస్సులు లేకపోవటంతో చాలా ఇబ్బంది అవుతోంది. మిగతా బస్సులు ఎక్కాలంటే ఫుల్ రష్ ఉండటంతో పాటు దొంగల భయం ఉండేది. ఏసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఉండటంతో ప్యాసింజర్లకు ఎంతో సెక్యూరిటీ ఉండేది. క్యాబ్ సౌకర్యం కల్పించని కంపెనీల ఉద్యోగులకు ఆ ఏసీ బస్సులు ఎంతో సౌకర్యంగా ఉండేవి. జిల్లాలకు ఏసీ బస్సులు ఉన్నా సిటీలో నడిచే మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను కూడా అటువైపే ఎందుకు నడపుతున్నారో వారికే తెలియాలి.
- విక్రమ్, రామంతాపూర్