వైద్యుల నిర్లక్ష్యానికి 8 నెలల బాలుడు మృతి

 వైద్యుల నిర్లక్ష్యానికి 8 నెలల బాలుడు మృతి

సూర్యాపేట: వైద్యుల నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని 8 నెలల బాలుడు మృతి చెందాడు. పేరు కే పెద్దాసుపత్రి.. ఇక్కడ వైద్యులు ఉండరు.. ఏ రోగం వచ్చిన ఇక్కడ కాదు మరోచోటకు తీసుకెళ్లండి అంటూ ఆస్పత్రి ఉచిత సలహాలు ఇస్తుండడంతో చికిత్సలో ఆలస్యంతో ఎంతో మంది అమాయకులు చనిపోవడానికి కారకులవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ 8 నెలల చిన్నారి మృతితో దంపతులు, వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ విలపిస్తుండడం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. 
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నిన్న అర్ధరాత్రి వేళ 8 నెలల పసికందును పాము కాటేసింది. పసిబాలుడు ఏడుపు మొదలుపెట్టడం గమనించిన తల్లిదండ్రులకు తమ బాబు పక్కనే పారిపోతున్న పాము కనిపించింది. తమ చిన్నారిని కాటు వేసిన పామును వారు వెంటనే చంపేశారు. చంపిన పాము ను తీసుకొని హుటాహుటిన బాబును హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. హాస్పటల్లో ఉన్న ఇద్దరు నర్సులు ఇక్కడ  డ్యూటీ డాక్టర్ లేరని, తమకు వైద్యం చేయడం రాదని, వేరే హాస్పిటల్ కు తీసుకోని పోవాలని ఉచిత సలహా ఇచ్చారని బంధువులు తెలిపారు. చేసేది ఏమి లేక పట్టణం లోని మరో ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు కోదాడ తీసుకొనిపొమ్మని చెప్పారు. కోదాడలో ఓ హాస్పిటల్ డాక్టర్ ఖమ్మం తీసుకొని వెళ్లాలని సూచనలు చేశారు. అక్కడ నుండి ఖమ్మం తీసుకొని పోయారు. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాబు కళ్లు తేలేశాడు. 

తమ బాబుకు పాము కరచిందని.. వైద్యం చేయమని ఆస్పత్రుల చుట్టూ తిరిగే టప్పటికి చాలా సమయం వృధా కావడం.. నిర్ణీత సమయంలోగా పాము కాటుకు విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇవ్వకపోవడంతో  పాము కాటుకు బాబు బలి అయిపోయాడు.  హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో పాము కాటుకు ఇంజెక్షన్లు ఉన్నా.. డ్యూటీ డాక్టర్ లేక పోవడం  వలనే బాబు ప్రాణాలు కోల్పోయడాని తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.