ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త ట్విస్ట్.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్

ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త ట్విస్ట్.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో అమన్‌దీప్‌ సింగ్‌ ధాల్‌, రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రా తదితరుల ఆస్తులు ఉన్నాయి. సిసోడియా, అతని భార్య సీమాకు చెందిన ఆస్తులు, వారి బ్యాంకు ఖాతాలలోని రూ. 11 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సిసోడియాకు సన్నిహితుడిగా ఉన్న ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ చర్యలకు ఉపక్రమించింది. సిసోడియా ప్రతిష్టను దిగజార్చేందుకు కేంద్రం మీడియాలో కథనాలు ప్రసారం చేసిందని ఆప్ నేత అతిషి ఈ సందర్భంగా ఆరోపించారు. "ఈడీ సీజ్ చేసిన రెండు ఫ్లాట్లలో ఒకటి మనీష్ సిసోడియాది 2005లో అంటే 18 ఏళ్ల క్రితం కొన్నది. మరో ఫ్లాట్ 2018లో కొనుగోలు చేసినట్లు ఈడీ స్వయంగా తమ పత్రాల్లో పేర్కొంది. ఇది కొత్త ఎక్సైజ్ పాలసీకి చాలా ఏళ్ల ముందు జరిగింది" అని అతిషి చెప్పుకొచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని తీసుకురావడంలో మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు కూడా ఆదేశించారు. ఆ తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీకి అమల్లోకి తెచ్చింది. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానాన్ని మళ్లీ తీసుకువచ్చిందంటూ బీజేపీ ఆరోపించింది.