V6 News

సీట్లు పెంచితే సౌత్కు వచ్చే నష్టమేంటి? : బండి సంజయ్

సీట్లు పెంచితే సౌత్కు వచ్చే నష్టమేంటి? : బండి సంజయ్
  • రేవంత్ రెడ్డి డబ్బున్న వాళ్లకే ఓట్లు, సీట్లు ఇద్దామంటారా?: బండి సంజయ్
  • వలసపోవడానికి అవకాశవాదిని కాదని, తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని వెల్లడి

హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మనిషిలా కాకుండా, కాంగ్రెస్ హైకమాండ్‌కు మూటలు పంపే ‘మనీ’ మనిషిలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే నష్టమేంటో నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి విభజన రాజకీయాలు చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని  సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అత్యధిక ఆదాయం ఇచ్చే వాళ్లకే సీట్లు, ప్రాధాన్యత ఇవ్వాలన్న రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులతో జరిగే నష్టమేమిటో చెప్పే దమ్ములేక రాజకీయం చేయాలనుకంటున్నారా? డీలిమిటేషన్ లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే నష్టం ఏమిటి? డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకు పెడతారా? లక్ష కోట్లు ఉన్న మీ కుటుంబానికి లక్ష ఓట్లు ఇవ్వాలా? డబ్బులేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా? మీరు చెప్పిన ఆర్థిక (జీఎస్డీపీ) సూత్రం ప్రకారమే డీలిమిటేషన్ చేయాలా?’ అని సీఎం రేవంత్​ను ప్రశ్నించారు.

బండి సంజయ్ సైతం లక్ష్మణ్ మాదిరిగా ఏదో ఒక రాష్ట్రానికి వలస పోక తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ.. ‘వలసపోవడానికి నేను అవకాశవాదిని కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే కాదు. చావైనా బతుకైనా కరీంనగరంతోనే. నా రక్తం కాషాయమే. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటా. నేను చనిపోతే నా శవంపై కప్పేది కూడా కాషాయ జెండానే. ఆ సన్నివేశం చూడటానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేండ్లు బతికి ఉండాలి’ అని పేర్కొన్నారు.