- 24న కాంగ్రెస్, బీజేపీ స్టేట్ ఆఫీసుల మందు నిరసన చేపడ్తం: రాజారామ్ యాదవ్
జూబ్లీహిల్స్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలపైనే ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 24న కాంగ్రెస్, బీజేపీల స్టేట్ ఆఫీసుల ముందు ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుపును బీసీల గెలుపుగానే చూడాలి తప్ప.. కాంగ్రెస్ గెలుపుగా చూడొద్దన్నారు.
బీసీలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్, బీజేపీలను బొంద పెడతామని హెచ్చరించారు. సామాజిక న్యాయం పేరుతో దేశంలో తిరుగుతున్న రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. హిందువుల బాగోగుల గురించి మాట్లాడే కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టిలో బీసీలు హిందువులు కారా అని ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ ఆఫీస్‌ల ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకోటి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
