ఎన్ని కుట్రలు చేసినా ఆగదు: దుగ్యాల ప్రదీప్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఏ ఎన్నికలు జరిగినా.. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తం అని ప్రకటిస్తూ రాష్ట్ర సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆరోపించారు. ఏడేండ్లలో 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ నెల 16న ట్యాంక్ బండ్ పై బీజేపీ చేపట్టనున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్‌ను పార్టీ స్టేట్ ఆఫీసులో మంగళవారం ఆవిష్కరించారు.
తర్వాత ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు మిలియన్ మార్చ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 16 వరకు అన్ని యూనివర్సిటీల దగ్గర, రౌండ్ టేబుల్ సమావేశాలు, చైతన్య ర్యాలీలు చేస్తామన్నారు. మిలియన్ మార్చ్ లో పాల్గొనే నిరుద్యోగులు 63591 19119 నంబర్ కు మిస్డ్ కాల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
