టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘంగా సాగిన చర్చలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రమేయంతో
విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు నెతన్యాహు చేసిన ఒక ఫోన్ కాల్ చర్చల గమనాన్ని పూర్తిగా మార్చివేసిందని టెహ్రాన్ పేర్కొంది.
ఈ వివరాలను వెల్లడిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘చర్చలు కీలక దశలో ఉన్నప్పుడు జేడీ వాన్స్‌కు నెతన్యాహు ఫోన్ చేశారు. ఆ తర్వాతే అమెరికా తన వైఖరిని మార్చుకుంది. వాషింగ్టన్ తన సొంత ప్రయోజనాల కంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది’’ అని ఆరోపించారు.
యుద్ధం ద్వారా సాధించలేని అంశాలను చర్చల టేబుల్ వద్ద సాధించాలని అమెరికా ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. అయితే, ఈ ఫోన్ కాల్, చర్చల వివరాల గురించి అమెరికా అధికారికంగా స్పందించలేదు.
