కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకే డీలిమిటేషన్ అంటోందన్నారు. ఆదివారం బంకురా, పూర్బా బర్థమాన్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను బిహార్ లేదా ఒడిశా రాష్ట్రాల్లో విలీనం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని పేర్కొన్నారు. బెంగాల్‌ను విభజించి, మన రాష్ట్ర ప్రాంతాలను పొరుగు రాష్ట్రాల్లో కలపాలని చూస్తోందన్నారు. దీనివల్ల అక్కడ నివసించే బెంగాలీలు తీవ్ర ఇబ్బందులకు, వేధింపులకు గురవుతారని చెప్పారు.
- టీఎంసీని ఓడించేందుకు రూ.1,000 కోట్ల డీల్
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను ఓడించేందుకు బీజేపీ రూ.1,000 కోట్లతో డీల్ కుదుర్చుకుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోను ప్రస్తావిస్తూ.. మైనారిటీ ఓట్లను చీల్చి టీఎంసీని ఓడించేందుకు ఓ రాజకీయ పార్టీ నేతకు ఇప్పటికే రూ.200 కోట్లను అడ్వాన్స్‌గా ఇచ్చిందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ నేతలు మత్తు కలిపిన టీ, మిఠాయిలు ఇచ్చే అవకాశం ఉందని, వాటిని తీసుకోవద్దని హెచ్చరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు సోదాల పేరుతో మహిళలను అగౌరవపరుస్తున్నాయని, అలాగే ప్రధాని సభలకు ఇచ్చే అనుమతులు తన సభలకు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు.
