డీకే కేబినెట్లో సీనియర్ల అసంతృప్తి.. ఒకరి రాజీనామా, తన సీనియార్టీని గౌరవించలేదని మరో మంత్రి విమర్శలు

డీకే కేబినెట్లో సీనియర్ల అసంతృప్తి.. ఒకరి రాజీనామా, తన సీనియార్టీని గౌరవించలేదని మరో మంత్రి విమర్శలు

బెంగళూరు: కర్నాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవుల కేటాయింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే పార్టీ సీనియర్ నాయకులలో అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మరో సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప తన శాఖల కేటాయింపుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

బుధవారం సీఎం డీకేతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి.. తనకు కేటాయించిన శాఖల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నాకు బెంగళూరు డెవలప్​మెంట్​ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇస్తామని చెప్పారు. నేను సరే అన్నాను. కానీ, ఆ తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారు. అది నాకు ఆమోదయోగ్యం కాదు. అందుకే నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, రామలింగారెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత కేహెచ్ మునియప్ప కూడా తన శాఖల కేటాయింపు తీరును తప్పుపట్టారు. ఈ ప్రక్రియలో సీనియార్టీని సరిగ్గా గౌరవించలేదని ఆయన వాదించారు. ఈ విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మునియప్ప అప్పీల్ చేశారు.