హైదరాబాద్ లో ఫ్లాట్ల విక్రయాల పేరిట జరిగిన భారీ మోసంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫ్లాట్లు ముందుగానే విక్రయించి.. ఆ విషయాలు చెప్పకుండా మళ్లీ మరికొందరికి ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి కోట్లలో దండుకున్న నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్లతో 15 కోట్ల 26 లక్షల రూపాయల మోసానికి పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశారు. నిడమర్తి శివప్రసాద్, నవీన్‌కుమార్ గోయల్, నరేంద్రకుమార్ మోదీ, శశికాంత్‌మోదీ లపై సైబరాబాద్ ఎకనమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసునమోదు చేశారు.
నిజాంపేటలోని 3 ఎకరాల్లో నిర్మించిన ఫ్లాట్లను గతంలో కొందరికి విక్రయించారు నిందితులు. ఈ వివరాలను దాచేసి మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, సూర్యకమల్ ప్రసాద్‌కు డబల్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో తాము మోసపోయినట్లుగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబరాబాద్ EOW పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
