హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని చంద్రబాబు మాట్లాడుతున్నారని.. అంటే.. రేవంత్ రెడ్డితో వీళ్లకు రహస్య ఒప్పందం ఉందని తెలుస్తుందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెనుక గొప్ప ఆలోచన ఉందని.. రాయలసీమ, నెల్లూరుకు ఆ ప్రాజెక్ట్ సంజీవని వంటిందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని జగన్ విమర్శించారు.
స్వలాభం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎంతటి ద్రోహమైనా చేస్తారని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. ‘‘నేను చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపించాను. నాపై ఉన్న గౌరవంతోనే బాబు ఆ పనులు ఆపారు. దీనిపై అవసరమైతే ఏ నిజ నిర్ధారణకైనా నేను సిద్ధం’’ అంటూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
నీళ్ల పంచాదిపై జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి:
* చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో ప్రాజెక్టులు చేపడుతున్న తెలంగాణ
* SLBC ద్వారా 45 టీఎంసీలు తరలించే పనులు
* 777 అడుగుల నుంచే ఎడమ వైపు పవర్ హౌస్ ద్వారా 4 టీఎంసీల నీళ్లను ఖాళీ చేస్తున్న తెలంగాణ
* నీళ్లు లేకుండా ఏపీ జనం ఇబ్బందులు పడుతున్నాం
* శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అవుతుంటే ప్రాజెక్ట్ ఎప్పుడు నిండుతుంది: వైఎస్ జగన్
* పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి.. కానీ, 20 ఏళ్లలో రెండు, మూడు సార్లే ఆ నీటిని తీసుకున్నాం
* 800 అడుగులలోపే 2 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి మొదలు పెట్టారు
జగన్ ఆరోపణలను పక్కన పెడితే.. నదీ జలాల విషయంలో ఏపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే.. మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడూ అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓపక్క చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మరోపక్క కృష్ణా బేసిన్లో స్టోరేజీ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఎప్పుడో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, కోయిల్ సాగర్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ సహా16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కు నిరుడు డిసెంబర్ 5న ఏపీ లేఖలు రాయగా.. అవి తాజాగా బయటపడ్డాయి. అంతేకాదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్, డిండి, భీమా, భక్తరామదాసు సహా మరో 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021 నుంచి 2024 వరకు రాసిన లేఖలనూ వీటికి జత చేయడం గమనార్హం. గతంలోనూ పాలమూరు–రంగారెడ్డిని అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు చంద్రబాబు 5 లేఖలు రాసి రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేందుకు యత్నించారు.
