కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. "రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, పంట నష్టంపై ఈ పర్యటనలో మీరు కేంద్రానికి నివేదిక సమర్పించి, సహాయం కోరతారేమోనని ప్రజలు ఆశించారు. దానికి భిన్నంగా మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అవసరమైన నిధులు, అప్పుల కోసం ప్రయత్నించడం విస్మయాన్ని కలిగిస్తోంది. రైతులు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మీరు మాత్రం కమీషన్లు వచ్చే అవకాశం ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల కోసం బరితెగించి ఢిల్లీలో లాబీ చేయడం శోచనీయం. దాని కోసమే మీరు ఢిల్లీ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మీ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతులు, ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి మీ సన్నిహిత కాంట్రాక్టర్ల బిల్లుల కోసం సిగ్గు లేకుండా వారం రోజులు ఢిల్లీలో చీకటి ప్రయత్నాలు చేయడం అత్యంత దారుణం. ఘోరం జరిగితే... పైసా సాయం లేదేమీ!? గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో భారీవర్షాలతో జనజీవితం అస్తవ్యస్తమైంది. మెజారిటీ జిల్లాల్లో రైతులు వేసుకున్న పంటలు నీట కొట్టుకుపోయాయి. 

రూ.1500 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 72 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే అందులో 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ రూ.498 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.449 కోట్లు, సాగునీటి శాఖ రూ.33 కోట్లు, పురపాలక శాఖ రూ.379 కోట్లు, విద్యుత్ శాఖ రూ. ఏడు కోట్లు కలిపి సుమారు రూ.1400 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు వేసి, మీరు కేంద్రానికి ఓ తూతూ మంత్రపు నివేదిక పంపి చేతులు దలుపుకున్నారు. కానీ అత్యంత కీలకమైన పంట నష్టంపై మాత్రం అంచనాలు వేయించలేదు. నివేదికలు ఇవ్వలేదు. ఆయా శాఖలు అంచనా వేసిన నష్ట అంచనాలకు వేటికీ శాస్త్రీయత లేదు. నష్ట అంచనాలను లెక్క కట్టడంలో సాధారణంగా పాటించే ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు. కేంద్రానికి పంపిన నివేదికలో పంట నష్టం అంశమే లేదు. పంట నష్టం అంచనాకు సంబంధించిన ఎన్యూమరేషన్ కు సంబంధించి మీ ప్రభుత్వం ఉత్తర్వులే ఇవ్వలేదు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ దఫా వరదల్లో ఒక్క పత్తి పంటే ఎనిమిది లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. వరి, మొక్క జొన్న, సోయాబీన్, కంది లాంటి పంటలు దెబ్బతిన్నాయి.

పంట నష్టం జిల్లాల వారిగా సుమారు ఎకరాల్లో...
నిజామాబాద్ -                 49,500 ఎకరాలు
భూపాలపల్లి -                 32,500 ఎకరాలు
భద్రాద్రి కొత్తగూడెం -            10,900 ఎకరాలు
మంచిర్యాల -                27,500 ఎకరాలు
ఆసిఫాబాద్ -                45,500 ఎకరాలు
ఆదిలాబాద్ -                1,03,000 ఎకరాలు
నిర్మల్ -                20,200 ఎకరాలు

ఈ నష్టానికి తోడు  వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. కొన్ని చోట్ల వరదలతో గులకరాళ్లతో పొలాలు నిండిపోయాయి. వేసిన పంట నష్టపోవడమే కాక తిరిగి పంట వేసుకోవాలంటే ఆ పొలాలను శుభ్రం చేసుకోవడం రైతులకు ఆర్థికంగా తలకు మించిన భారం. ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయించక పోవడం దుర్మార్గం... క్షమించరాని నేరం. వరద ప్రాంతాల్లో తూతూ మంత్రంగా మీరు చేసిన పర్యటనతో ప్రజలకు ఒరిగింది ఏమిటి? కౌబాయ్ లాగా విహార యాత్రకు వెళ్లినట్టు ఉందే తప్ప ఆ పర్యటనతో రైతులకు, వరద బాధితులకు ఏం ఊరట లభించిందో చెప్పగలరా?. ఇక భారీ వర్షాలతో సంభవించిన వరదలతో 40 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 934 గ్రామాల్లో 12,704 ఇళ్లు దెబ్బతిన్నాయి. 1456 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇంత ఘోరం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుండి పైసా సాయం లేదు. కేంద్ర సాయమైనా కోరతారేమో అనుకుంటే కమీషన్లు దండుకునేందుకు కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మీరు ప్రయత్నించారు తప్ప కేంద్ర వరద సాయం పై మాత్రం కనీస ప్రయత్నం చేయలేదు.

జనాలు చస్తుంటే డ్రామాలేంటి...!?
రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడిచిపోయి తొమ్మిదో ఏడాదికి సమీపంలో ఉన్నాం. విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనేక హామీలు ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా ఈ హామీలను ప్రకటించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అన్నది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తరువాత కొలువుదీరే ప్రభుత్వాలకు ఉంటుంది. మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు మొండి చేయి చూపుతున్నా జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నికలు, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు, నల్ల వ్యవసాయ చట్టాలు లాంటి అనేక కీలక అంశాలకు మీరు మద్ధతిచ్చారు. పీఏ ప్రభుత్వం తెలంగాణాకే మణిహారంగా నిలిచే ఐటీఐఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మంజూరు చేస్తే మోదీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇన్నాళ్లు దానిపై మేం నెత్తినోరు మొత్తుకుంటున్నా బెల్లంకొట్టిన రాయిలా మీరు నోరు మెదప లేదు.  మీ పుత్రరత్నం మాత్రం సోషల్ మీడియానే నమ్ముకుని, ట్విట్టర్ లో కామెంట్ చేసి కాలక్షేపం చేస్తున్నారు. కాలుకు దెబ్బ తగిలిందని సానుభూతి కోసం ఫోటోలు పోస్టు చేసి, ప్రశాంత్ కిషోర్ డ్రామాను రక్తి కట్టించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు.కేంద్రం నుండి న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని 2017 లోనే మహారాష్ట్ర తన్నుకు పోతుంటే ఆ నాడు మీరు మోడీ చంకనెక్కి ఊరేగుతున్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని అటకెక్కిస్తే మీరు గుడ్లప్పగించి చూడటం తప్ప గుడ్లురిమి అడిగింది లేదు. 

ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకునే సోయి మీకు లేదు. రెండో దఫా కూడా ప్రభుత్వాల కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో కనీసం ఈ అంశాలనైనా ప్రస్తావిస్తారేమోనని తెలంగాణ సమాజం ఆశించింది. ఆ విషయంలో కూడా మళ్లీ నిరేశే మిగిలింది. పిల్లలు చస్తుంటే... జాలనిపించడం లేదా!? ఒకవైపు రాష్ట్రంలో గిరిజన, బీసీ గురుకులాల్లో కలుషిత ఆహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యమంత్రి మనుమడు ఏ సన్నబియ్యం తింటున్నాడో అదే ఆహారాన్ని పేద పిల్లలకు పెడుతున్నామని ఊరువాడా తిరిగి చెప్పారు. కలుషిత ఆహారం తిని పేద విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఒక్కనెలలోనే పది చోటుచేసుకున్నాయి. ఒక్క ఘటనపై కూడా విచారణకు ఆదేశించ లేదు. బాధ్యులపై చర్యలు తీసుకున్నది లేదు. బాసర త్రిపుల్ ఐటీలో నెలన్నర క్రితం ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు.
విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసే దుస్థితికి మీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం దిగజారింది.

డిమాండ్లు :
నష్టపోయిన పంటకు ఎకరాకు కనీసం రూ.20 వేల పరిహారం ఇవ్వాలి. నష్టపోయిన వారిలో కౌలు రైతులను గుర్తించి, నేరుగా వారికే పరిహారం ఇవ్వాలి. వాణిజ్య పంట అయిన పసుపునకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి. ఇసుక మేట వేసుకున్న పొలాలు బాగు చేసుకోవడానికి రైతులకు ఆర్థిక సహాయం చేయాలి. వరదల్లో కొట్టుకుపోయిన పంపు సెట్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేయాలి. పూర్తిగా, పాక్షికంగా నష్టం జరిగిన ఇళ్లకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కేటాయించాలి. పూర్తిగా నష్టపోయిన ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా నష్టం జరిగిన ఇంటికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ మొత్తం నష్టం లెక్క శాస్త్రీయంగా తేలాలంటే ప్రభుత్వం అధికారికంగా సర్వే చేయాలి. సమగ్ర నివేదిక రూపొందించి... ఆ నివేదికను ప్రజల ముందు ఉంచాలి. అఖిలపక్ష సలహాలు తీసుకోవాలి. ఈ నివేదికను శాసనసభలో  ప్రవేశ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. పశువులను కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు అప్పులపై రెండేళ్ల పాటు మారటోరియం విధించాలి.