టెక్నాలజీకి బానిస కావొద్దు..స్కిల్స్ పెంచుకునేందుకు వినియోగించుకోవాలె: ప్రధాని మోదీ 

టెక్నాలజీకి బానిస కావొద్దు..స్కిల్స్ పెంచుకునేందుకు వినియోగించుకోవాలె: ప్రధాని మోదీ 
  • దేశ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన
  • ఈ ఏడాది పరీక్షా పే చర్చ 
  • రెండో ఎపిసోడ్‌‌లో కామెంట్స్

టెక్నాలజీకి బానిసలుగా మారిపోవద్దని స్టూడెంట్స్​కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏఐ లాంటి టెక్నాలజీని నైపుణ్యాలు మెరుగుపరుకోవడానికే ఉపయో గించాలన్నారు. చదువును భారంగా భావించకూడదని చెప్పారు.

న్యూఢిల్లీ: టెక్నాలజీకి బానిసలుగా మారిపోవద్దని దేశంలోని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను కేవలం ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించాలని, నేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా చూడవద్దన్నారు. పరీక్షా పే చర్చ 2026 తొమ్మిదవ ఎడిషన్.. రెండో ఎపిసోడ్‌‌లో మోదీ మాట్లాడారు. ‘‘మొబైల్ ఫోన్లు కొంతమంది పిల్లలకు యజమానులుగా మారాయి. ఫోన్, టీవీ లేకుండా భోజనం కూడా తింటలేరు.

 ప్రతి యుగంలోనూ కొత్త టెక్నాలజీపై ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు అభివృద్ధి చెందిన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లతోనూ భయపడాల్సిన అవసరం లేదు. మానవ జీవితానికి సాంకేతికత యజమాని కాకూడదు. టెక్నాలజీకి బానిస కాకూడదని మీరే దృఢ సంకల్పం ఏర్పరుచుకోవాలి" అని స్టూడెంట్లకు సూచించారు. కోయంబత్తూర్, రాయ్‌‌పూర్, గువాహటి, గుజరాత్ (దేవ్ మొగ్రా)లోని విద్యార్థులతో మాట్లాడిన మోదీ..ఏఐ వంటి కొత్త టెక్నాలజీని నైపుణ్యాలు మెరుగుపరుకోవడానికే ఉపయోగించాలని సూచించారు.

 ఎడ్యుకేషన్ ను భారంగా భావించకూడదని, మార్కులపై మాత్రమే కాకుండా జీవితాన్ని మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగాల స్వభావం తరచూ మారుతున్నదని..అందుకు తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు మాత్రమే టెక్నాలజీని యూజ్ చేయాలని కోరారు. సాంకేతికతను అర్థం చేసుకోవడం, స్కిల్స్ పెంచుకోవడం, వాటిని జాబుల్లో  ఇంటిగ్రేట్ చేయడం ద్వారా భయం లేకుండా ముందుకుసాగవచ్చని మోదీ  చెప్పారు. 

గత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయండి

పరీక్షలకు ముందు గత ప్రశ్నపత్రాలను కూడా బాగా ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు. మంచి ప్రిపరేషనే ఎగ్జామ్ టెన్షన్​ను దూరం చేస్తుందని.. మంచి తిండి, నిద్ర రోజంతా ఉల్లాసంగా ఉంచుతుందన్నారు. నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. భయంలేకుండా ఉండటమే మొదటి గుణమని తెలిపారు. మీ ఆలోచనలను10 మందికైనా స్పష్టంగా తెలియజేసే సామర్థ్యంకలిగి ఉండాలని స్టూడెంట్లకు సూచించారు. కెరీర్ ఎంపికలపై మోదీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండటం సహజమేనని.. శ్రమ, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని చెప్పారు.