హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును భారత దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిటీష్ వారు భారత్-పాకిస్తాన్‌ను విడగొట్టినట్లే ఆంధ్ర-, తెలంగాణ విభజన జరిగిందని ఆయన మాట్లాడటం దుర్మార్గమన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని దేశ విభజన నాటి రక్తపాతంతో పోల్చడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. బయట తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుపుకుంటామని చెప్పే బీజేపీ నేతలు.. పార్లమెంట్లో మాత్రం రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

