ఒక్క ఏడాదిలో రూ. 232 కోట్ల సైబర్ ​ఫ్రాడ్స్

ఒక్క ఏడాదిలో రూ. 232 కోట్ల సైబర్ ​ఫ్రాడ్స్
  •     కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 5,342 సైబర్‌‌‌‌ కేసులు 
  •     రూ.24.90 కోట్లు లూటీ చేసిన దొంగలు 
  •     రూ.104 కోట్లకుపైగా ట్రాఫిక్ చలాన్ల వసూలు  
  •     వార్షిక నివేదిక రిలీజ్​ చేసిన సైబరాబాద్ సీపీ మహంతి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ ఫ్రాడ్స్​తో ఏటా వందల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా రూ.232.34 కోట్లు కొట్టేసి పోలీసులకు సవాల్‌‌‌‌ విసిరారు. గత ఏడాది కంటే మూడింతలు ఎక్కువగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దోపిడీ చేశారు. వీటిలో పోలీసులు కేవలం రూ.46 కోట్లు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగతా రూ.186.34 కోట్లు సైబర్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్స్‌‌‌‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. మొత్తంగా ఈ ఏడాదిలో కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ 8 శాతం పెరిగింది. 2023లో నమోదైన కేసుల వివరాలతో కూడిన వార్షిక నివేదికను సైబరాబాద్ సీపీ అవినాశ్​ మహంతి ఈ మేరకు శనివారం విడుదల చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌‌‌ హత్యకు కుట్ర కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. పూర్తి వివరాలను సేకరించిన తరువాత ఆ కేసుల స్టేటస్‌‌‌‌ వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఏడాది అన్ని సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 5,342 కేసులు నమోదు కాగా168  కేసులను ఛేదించి 339 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అయితే, గతేడాది 4,850 కేసులు నమోదు కాగా.. బాధితులు రూ.66.66 కోట్లు కోల్పోయారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల్లో సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్ టాప్ లో నిలిచింది.   

ఓవరాల్ గా 29,156  కేసులు.. 

సైబరాబాద్ పరిధిలో నిరుడు మొత్తం 27,322 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29,156  కేసులు రిజిస్టర్‌‌‌‌ అయ్యాయి. ఇండ్లలో చోరీలు ఇతర ప్రాపర్టీ నేరాలపై 2,904 కేసులు నమోదు కాగా1,845 కేసులను పోలీసులు ఛేదించారు. బాధితులు కోల్పోయిన రూ.24.90 కోట్లలో రూ.17.91 కోట్లు రికవరీ చేయగలిగారు. మరోవైపు చీటింగ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది 6,276 చీటింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 6,777కు పెరిగింది. ఈ ఏడాది డ్రగ్స్ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 277 కేసులు నమోదు చేశారు. రూ.27.82 కోట్ల డ్రగ్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. 567 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు డ్రగ్స్‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌ కాగా మిగిలిన 550 మంది మీడియేటర్స్,15 మంది కస్టమర్లు ఉన్నారు. మొత్తం 6,676 కిలోల గంజాయి,13 లీటర్ల హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌, 507 గ్రాముల కొకైన్‌‌‌‌, 261 గ్రాముల ఎండీఎంఏ, 1,750 గ్రాముల మెథాక్వలోన్‌‌‌‌, 120 గ్రాముల అల్ఫ్రాజోలమ్‌‌‌‌, 26 కిలోల చరాస్‌‌‌‌ సీజ్ చేశారు. 

మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై తగ్గిన దాడులు 

కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మహిళలపై వివిధ రకాల దాడులకు సంబంధించి గతేడాది 2,489 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,356కు తగ్గాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులకు సంబంధించి గతేడాది158 కేసులు రిజిస్టర్ కాగా, ఈ  సారి 133కు తగ్గాయి. మహిళలను వేధిస్తున్న 2,587 మంది పోకిరీలను షీ టీమ్స్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలతో సహా 88 మందిపై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 2,580 మందిపై ఈ–-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3,032 మందికి కౌన్సెలింగ్‌‌‌‌ ఇచ్చారు. 9 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మహిళలను వేధిస్తున్న పోకిరీలను డెకాయ్‌‌‌‌ ఆపరేషన్లతో ట్రేస్ చేశారు.11 మందిని అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. 

ట్రాఫిక్ ఫైన్​లు రూ.104 కోట్లు దాటినయ్
 
ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది 6,01,396 స్పాట్‌‌‌‌ చలాన్లు, 20,41,388 ఈ–-చలాన్లు విధించారు. వీటికి సంబంధించి మొత్తం రూ.104.27 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేశారు.  అయితే, గతేడాది ఇంతకంటే ఎక్కువగానే రూ.126.64 కోట్లు వసూలయ్యాయి. ఇక ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. గతేడాది3,224 రోడ్డు ప్రమాదాలు జరుగగాఈ ఏడాది 3,143 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 843 ఘోరమైన రోడ్డు ప్రమాదాలు కాగా.. 1,778 సాధారణ రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. అలాగే 52,125 డ్రంకన్ డ్రైవ్‌‌‌‌ కేసుల్లో 1,271 మందికి శిక్షలు పడ్డాయి. 24,318 మంది డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు సస్పెండ్ అయ్యాయి.