Hardik Pandya Trade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ట్రేడింగ్ విండోకు సంబంధించి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) ఘోర వైఫల్యం తర్వాత, హార్దిక్ ఆ జట్టును వీడే అవకాశం ఉందనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఏకంగా ఏడు ఐపీఎల్ జట్లు అతనిని దక్కించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. హార్దిక్ ని సొంతం చేసుకునేందుకు ప్రధానంగా రేసులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రచారంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు.
ఇప్పటికైతే ఎలాంటి చర్చలు లేవు:
హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకునే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ముగిసిన తర్వాతే మేము ఈ సీజన్ ప్రదర్శనపై పూర్తిస్థాయి రివ్యూ నిర్వహిస్తాం, ఆ తర్వాతే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. జూలై 18 వరకు జరిగే ఈ ఎంఎల్సీ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ జట్టు అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా పోటీ పడుతోంది.
►ALSO READ | ఫిఫా వరల్డ్‌కప్‌లో సెక్యూరిటీ వైఫల్యం?.. బెల్జియం vs సెనెగల్ మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లోకి ఫ్యాన్ ఎంట్రీ
రుతురాజ్ కెప్టెన్సీపై ప్రశ్నలు.. చెన్నై కెప్టెన్‌గా హార్దిక్?:
ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మినహా మిగిలిన అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా మూడు సీజన్ల పాటు సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం, అలాగే టీ20 ఫార్మాట్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అతని కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే అతనికి జట్టు పగ్గాలని ఇవ్వడానికి సరైన ప్రత్యామ్నాయం అవుతాడని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
గత ఏడాది శాంసన్, జడేజా ట్రేడింగ్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత ఏడాది కూడా ఇలాంటి ఒక హై-ప్రొఫైల్ ట్రేడింగ్‌లో భాగమైంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి సంజు శాంసన్ సీఎస్‌కే జట్టులోకి రాగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ లోకి వెళ్లాడు. ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2026 నిరాశాజనకంగా సాగినప్పటికీ, వైట్-బాల్ క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన హార్దిక్ పాండ్యా కోసం ఐపీఎల్ జట్ల మధ్య ఇంతటి భారీ పోటీ ఉండటం సహజమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
