ఒకేసారి రెండు తుపానులు.. అరేబియాసముద్రంలో తేజ్.. బంగాళాఖాతంలో హమూన్

ఒకేసారి రెండు తుపానులు.. అరేబియాసముద్రంలో తేజ్.. బంగాళాఖాతంలో హమూన్

అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను తీవ్రరూపం దాల్చనుంది. మరోవైపు బంగాళాఖాతంలో కొత్త తుపాను ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక తుపాను వస్తోందంటేనే తీర ప్రాంత ప్రజలు భయపడిపోతుంటారు. అలాంటిది.. ఇండియా మీదకు ఒకేసారి రెండు తుపానులు మంచుకొచ్చే ప్రమాదం ఉందన్న వార్త వింటే...  త్వరలో ఇదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు అరేబియా సముద్రంలో, ఇటు బంగాళాఖాతంలో రెండు వేరువేరు తుపానులు దూసుకొచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

తేజ్,​ హమూన్​ తుపానులు

అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను ఇప్పటికే ఆందోళనకరంగా మారింది.  ఈ సైక్లోన్​ మరింత తీవ్రరూపం దాల్చుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. అది తీవ్రరూపం దాల్చి తుపానుగా మారితే.. దానిని హమూన్​ తుపాను అని పేరు పెడతామని ఐఎండీ స్పష్టం చేసింది.నైరుతి అరేబియా సముద్రంలో తేజ్​ తుపాను తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ( అక్టోబర్ 22) నాటికి ఇది తీవ్రరూపం దాల్చుతుంది. అక్కడి నుంచి ఒమన్​వైపు ఈ తుపాను ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలో శుక్రవారం ( అక్టోబర్ 20) అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం (అక్టోబర్ 23) నాటికి మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తుపానుగా మారలేదని ఐఎండీ తెలిపింది.అయితే ఈ తేజ్​ తుపాను, హమూన్​ తుపానుల కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఐఎండీ చెబుతోంది. ఇండియాపై వీటి ప్రభావం తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. చెన్నైతో పాటు తమిళనాడు తీర ప్రాంతాలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాకపోతే కేరళ, మధ్య తమిళనాడు ప్రాంతాల్లో  ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది.  తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.