- కార్యదర్శుల వీసీలో పీఆర్, ఆర్డీ కమిషనర్ దివ్య దేవరాజన్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు:15వ ఆర్థిక సంఘం నిధుల చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పీఆర్, ఆర్డీ కమిషనర్ దివ్యదేవరాజన్ హెచ్చరించారు. ప్రతి పైసా చెల్లింపు చేసే సమయానికి దానికి సంబంధించిన నోట్ ఫైల్, బిల్లులను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సోమవారం కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన ఆధారాలు లేకుండా నిధులు విడుదల చేస్తే, వాటిని దుర్వినియోగంగా పరిగణిస్తామని, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
పనులకు సంబంధించిన ఫొటోలను సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని చెప్పారు. కొందరు కార్యదర్శులు డమ్మీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతమైతే బాధ్యులైన కార్యదర్శులను వెంటనే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

