వానాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలె

వానాకాలం వ్యాధులపై  అప్రమత్తంగా ఉండాలె

వర్షాకాలం వచ్చిందంటే హాస్పిటల్స్ అన్నీ కిట కిటలాడుతాయి. ఈ కాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో... అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా రైనీ సీజన్ లో  ముందస్తు జాగ్రత్తలపై  స్పెషల్ స్టోరి. వర్షా కాలం మొదలు సీజన్ పూర్తయ్యే దాకా వర్షాలు పడుతుంటాయి. ఈ సీజన్ లో మలేరియా, టైఫాయిడ్ , డయేరియా, డెంగీ, ఫైలేరియా, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, మెదడు వాపు వ్యాధి లాంటివి విజృంభించే అవకాశముంది. దోమలతో మలేరియా, డెంగీ వ్యాపిస్తాయి. ఎక్కువగా పగటి పూట కుట్టే దోమతోనే డెంగీ వస్తుంది. నీళ్ళు నిల్వ ఉన్న ప్రాంతాల్లోనే ఇది వృద్ధి చెందుతుంది. ఇళ్ళల్లో ఉండే పూల కుండీలు, టైర్లు, కొబ్బరి బొండాలు, కూలర్లలో దోమలు పెరుగుతాయని చెబుతున్నారు.  మూతలేని నీళ్ళ ట్యాంకులు, సిమెంట్, తారు రోడ్లపై నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు. చికెన్ గున్యా కూడా ఎక్కువగా ఈ కాలంలోనే వ్యాపిస్తుంది. మెదడు వాపు, ఫైలేరియా, స్వైన్ ఫ్లూ, డయేరియా లాంటి వ్యాధులన్నీ కలుషిత నీరు, కలుషిత ఆహారం, దోమకాటుతోనే వస్తాయి. 

మండే ఎండాకాలం నుంచి వానా కాలంలోకి రావడంతో వాతావరణం మారింది. దాంతో జలుబు, దగ్గు, జ్వరం కామన్ గా వస్తాయి. వాటిని లైట్ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను కూడా క్లీన్ గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేసి... వ్యాధుల బారిన పడే కన్నా... ముందు జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. కరోనా బూస్టర్ డోస్ తో పాటు...పిల్లలకు  వ్యాక్సినేషన్ తీసుకోని వారు టీకాలు ఇప్పించాలని సూచిస్తున్నారు. మాస్క్ , శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ లాంటి జాగ్రత్తలు మరి కొంతకాలం పాటించాలని చెబుతున్నారు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉంటూ...కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. తాగే నీరు రోజుల తరబడి నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు డాక్టర్లు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై జనానికి అధికారులు అవగాహన కల్పించి... ముందస్తు చర్యలు తీసుకుంటే  వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.