జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  పదేండ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి
  •  ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు నన్ను సంప్రదించిండ్రు
  •  డీ లిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో 154 సెగ్మెంట్లు

హైదరాబాద్: వచ్చే నెల ఐదో తేదీన బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా తనను సంప్రదించారని చెప్పారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ కు జూన్ 4వ తేదీన తాళం పడుతుందని చెప్పారు. 

బీఆర్ఎస్ నుంచి 70 శాతం మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 14 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. ఒకటి రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ కు ఒక్క  సీటు కూడా రాదని చెప్పారు. రాష్ట్రంలో డీలిమిటేషన్ తర్వాత 119 నియోజకవర్గాలు 154కు పెరుగుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని.. కానీ బతుకమ్మలో బ్రాండీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని తాము గుర్తించలేదని కోమటిరెడ్డి అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందన్నారు. తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని ఫుట్ బాల్ ఆడుకుంటానన్న తలసాని మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టామని, తాను మూడు రోజులు తనకు కేటాయించిన రూం నుంచి కాలు బయటపెట్టలేదని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి  పైరవీలు చేసుకున్నానని కొందరు ప్రచారం చేశారని, తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు.  తనకు ముఖ్యమంత్రి కాదు మంత్రి పదవి కావాలని కూడా ఢిల్లీకి పోలేదని చెప్పారు.  సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. 

పదేండ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. తనకు పదవులపై ఆశలేదని కోమటరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని అన్నారు. తమ జిల్లాలో పదేండ్లు మంత్రిగా ఉన్న ఒకాయన తలపైకెత్తి చూడరని, కిందకే చూస్తారంటూ పరోక్షంగా జగదీశ్ రెడ్డిని ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పనికూడా చేయలేదని అన్నారు.