మున్సిపల్ మేనియా..రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్.!

మున్సిపల్  మేనియా..రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్.!
  • రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌
  • నెలాఖరు నుంచే నామినేషన్లు.. ఫిబ్రవరి 15లోపు ప్రక్రియ పూర్తి
  • రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావహుల క్యూ
  • ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం.. ఆ వెంటనే జిల్లాల బాట
  • ప్రచారంలో మంత్రులు.. ఏర్పాట్లలో అధికారులు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డులవారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే (జనవరి 26) రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు  కనిపిస్తున్నాయి.  దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి, ఫిబ్రవరి 15వ తేదీలోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రూపొందించింది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోవడంతో మున్సిపల్ ఎలక్షన్ హీట్ మొదలైంది. 


పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో  ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  పంచాయతీ ఎన్నికల రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను రిపీట్​ చేయాలని అధికార పార్టీ చూస్తున్నది. పట్టణంలో బలంగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.

మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

 మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల చిక్కుముడి వీడడంతో  టికెట్ల వేట మొదలైంది. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వార్డుల్లోని ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల నివాసాలు ఆశావహులు, వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి. టికెట్ కోసం పైరవీలు, సిఫార్సులతో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉండటం.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. 

ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు రెబల్‌‌‌‌‌‌‌‌గా మారే ప్రమాదం ఉండటంతో, అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం నేతలకు సవాలుగా మారింది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థుల కోసం వేట సాగుతున్నది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. హార్వర్డ్​ బిజినెస్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో సర్టిఫికెట్​ కోర్సు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చేరుకోనున్నారు. ఆయన వచ్చాకే ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ పెంచేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వచ్చిన వెంటనే వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండనున్నాయి.  మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకునున్నారు.

జెట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌తో ఎన్నికల షెడ్యూల్ 

ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతున్నది. జనవరి 26న షెడ్యూల్ విడుదల చేసి, కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెలఖారు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టి, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు  గడువు ఇచ్చి ఫిబ్రవరి 14 కల్లా ఫలితాలు కూడా వెల్లడించేలా షెడ్యూల్ ఉండబోతున్నట్లు సమాచారం. శివరాత్రి, రంజాన్​ ఉపవాసాల  కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.  ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా సవరణలాంటి అంశాలపై మున్సిపల్ శాఖ, ఎన్నికల సంఘం అధికారులు నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతూనే.. చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి   సమయం దగ్గర పడుతుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. షెడ్యూల్ రాకముందే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.