ఎన్వోసీ ఉంటేనే ఎంట్రీ: ఎస్టీపీపీలో కాంట్రాక్ట్​ కార్మికులపై కుట్ర

ఎన్వోసీ ఉంటేనే ఎంట్రీ: ఎస్టీపీపీలో కాంట్రాక్ట్​ కార్మికులపై కుట్ర

ఏ యూనియన్​లోనూ చేరవద్దట..
 చోద్యం చూస్తున్న సింగరేణి మేనేజ్​మెంట్​   

మంచిర్యాల, వెలుగు: జైపూర్​సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) వర్కర్లు పోలీస్​ఎన్వోసీ సమర్పించి గేట్​పాస్​లు రెన్యువల్​ చేసుకోవాలని సీఐఎస్ఎఫ్​ డిపార్ట్​మెంట్​ఇటీవల ఆర్డర్స్​జారీ చేసింది. దీంతో కార్మికులు రామగుండం పోలీస్​ కమిషనరేట్​ బాట పడుతున్నారు. గత ఐదేళ్లలో అడగని ఎన్వోసీలు ఇప్పుడు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనివెనుక కార్మికుల హక్కులను హరించే  కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో 2016లో ఎస్టీపీపీని ప్రారంభించారు. ప్లాంట్​ ఆపరేషన్స్​తో పాటు పలు డిపార్ట్​మెంట్లను ప్రైవేట్​ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో ల్యాండ్​లూజర్స్, లోకల్స్​తో పాటు నాన్​ లోకల్స్​కు కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​జాబ్స్​ కల్పించారు. అన్ని డిపార్ట్​మెంట్లలో కలిపి సుమారు 1,500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు సింగరేణికి చెందిన సర్వీసెస్​ అండ్​ ప్రొటెక్షన్​ కార్ప్స్(ఎస్ అండ్ పీసీ) ఎస్టీపీపీ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించింది. ఈ సంస్థ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులకు మినహా ఇతర కార్మికులకు  కాంట్రాక్ట్​కంపెనీ జారీ చేసిన ఐడెంటిటీ కార్డు, ఆధార్​కార్డు చూపిస్తే గేట్​పాస్​లు జారీ చేసేవారు. ఎస్​అండ్​పీసీని రద్దు చేసిన తర్వాత సెంట్రల్​ ఇండస్ర్టియల్​సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించారు. ఈ సంస్థ రూల్స్​ ప్రకారం గేట్​పాస్​ల జారీ, రెన్యువల్​ కోసం పోలీస్​ఎన్వోసీ తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్వోసీలు తెచ్చి పాస్​లు రెన్యువల్​ చేసుకోవాలని ఆర్డర్స్​ జారీ చేశారు. 
కార్మికులపైనే ఎన్వోసీ భారం
ఏదైనా కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్​వర్కర్లకు పోలీస్​ఎన్వోసీలు అవసరమైతే సంబంధిత ఏజెన్సీయే కార్మికుల పేర్లను పోలీసులకు పంపించి ఎన్వోసీలు తీసుకుంటుంది. అందుకయ్యే చార్జీలను కూడా ఆ సంస్థలే భరించుకుంటాయి. ప్రస్తుతం ఎస్టీపీపీలో దీనికి భిన్నంగా జరుగుతోంది. కార్మికులే ఎన్వోసీలు తెచ్చుకోవాలని చెప్పి ఈ నెలాఖరు వరకు డెడ్​లైన్​ పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు లోకల్​పోలీస్​స్టేషన్లలోనే ఎన్వోసీలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది జైపూర్, ఇతర పోలీస్​స్టేషన్ల​నుంచి తీసుకున్నారు. కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికి జిల్లా ఎస్పీ లేదా కమిషనరేట్​నుంచి ఎన్వోసీలు జారీ చేయాలనే రూల్​ఉంది. దీంతో ఎస్టీపీపీ వర్కర్లు రామగుండం కమిషనరేట్​కు వెళ్తున్నారు. రోజూ సుమారు 50 మంది ఎన్వోసీల కోసం వస్తున్నట్టు అక్కడి ఆఫీసర్లు చెప్పారు. ఎన్వోసీ కోసం వెయ్యి రూపాయల డీడీ తీసి కమిషనరేట్​లో అప్లై చేసుకోవాలి. స్పెషల్​బ్రాంచ్(ఎస్​బీ) పోలీసులు సంబంధిత వ్యక్తులపై దేశవ్యాప్తంగా ఎక్కడైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి రిపోర్టు అందజేస్తారు. దాని ప్రకారం పోలీస్​కమిషనర్​ఎన్వోసీలు జారీ చేస్తారు. ఈ తతంగం పూర్తికావడానికి కనీసం పది పదిహేను రోజులు అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఈలోగా కార్మికులు మూడు నాలుగుసార్లు కమిషనరేట్​కు వెళ్తున్నారు. దీంతో డ్యూటీలు కోల్పోతున్నామని పేర్కొంటున్నారు. అంతా కలిపి రెండు వేలకు పైగా ఖర్చవుతోందని చెప్తున్నారు.

ఇప్పుడే ఎందుకు? 
ఎన్వోసీ అడగడంపై కార్మికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ వింగ్​లో మినహా ఇతర డిపార్ట్​మెంట్లలోని కార్మికులకు రిక్రూట్​మెంట్ ​టైంలో కూడా ఎన్వోసీలు అడగలేదని అంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ వర్కర్లకు కనీస వేతనాలు సైతం ఇవ్వడం లేదని, ఐదేళ్ల కిందట రూ.300 డెయిలీ వేజ్​పై చేరినవారికి ఇప్పుడు రూ.420 మించి చెల్లించడం లేదని అంటున్నారు. దీనిపై కార్మికులు ప్రశ్నిస్తుండడంతో   ఎన్వోసీలు అడుగుతున్నారని పేర్కొంటున్నారు. కార్మికులు ఏ యూనియన్​లోనూ చేరకుండా,   అలాగే కేసులు ఉన్నవారిని తొలగించి వాళ్ల స్థానంలో పైసలు తీసుకొని కొత్తవారిని నియమించుకోవాలనే కుట్ర ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సింగరేణి మేనేజ్​మెంట్​ స్పందించాలని కోరుతున్నారు.