పంచాయతీ సెక్రటరీలకు కొత్త ‘పరీక్ష’

పంచాయతీ సెక్రటరీలకు కొత్త ‘పరీక్ష’

ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ పాలన వ్యవహారాల్లో పగలు రాత్రి తేడా లేకుండా పనులు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు కొత్త ‘పరీక్ష’ ఎదురవుతోంది. ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న జేపీఎస్​లు, ఎప్పుడో దశాబ్దం కిందట జాబ్ లో చేరిన పంచాయతీ సెక్రటరీలు మరోవైపు.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అరకొర జీతం పొందుతున్న ఓపీఎస్ లు ఇంకోవైపు.. వీళ్లంతా ఓ ప్రత్యేక పరీక్షకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేవలం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఈ నెల 12న రాత పరీక్ష నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. 
ఎందుకీ పరీక్ష.. 
జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ విరివిగా గ్రామాల్లో పర్యటించారు. అయితే ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోయేసరికి కలెక్టర్ కార్యదర్శుల మీద ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, జేపీఎస్, ఓపీఎస్ లు గ్రాడ్యుయేట్లయినప్పటికీ ఫీల్డ్ లెవెల్ లో ఎందుకు పనులు జరగడం లేదన్న భావంతో కలెక్టర్ స్పెషల్ పరీక్షకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్కార్ పెట్టిన పరీక్షలు, ఇంటర్వ్యూ లు నెగ్గి మెరిట్ తో వచ్చిన సెక్రెటరీలకు ఇప్పుడు ఈ రిటెన్ టెస్ట్ అగ్ని పరీక్షగా మారుతోంది.
వంద మార్కుల పేపర్
ఈ నెల 12న జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలకు ఏక కాలంలో 16 అంశాలపై పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెటీరియల్ కూడా అందించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ లుగా చేరిన సమయంలో ఇచ్చిన రెండు కర దీపికలు 350 పేజీలు, హరితహారం బుక్ 60 పేజీలు, తడిపొడి చెత్త నిర్వహణపై 40 పేజీల మెటీరియల్ ఇప్పుడు బట్టీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వంద మార్కుల పరీక్షలో ఖాళీల పూరింపు, మల్టిపుల్ చాయిస్ ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షలో 35 మార్కులకు పాస్ కాగా, 80 ఆపై మార్కులు వచ్చేవాళ్లకు ర్యాంకులు ఇవ్వనున్నారు. 
అసలే టైమ్ లేదు.. 
పొద్దున్నే 6 గంటలకు గ్రామ పంచాయతీలో అటెండ్ అయి అక్కడ సెల్ఫీ ఫోటో తీసుడు నుంచి మొదలై సాయంత్రం వరకు ఫీల్డ్ డ్యూటీ, రిపోర్ట్ లు ఇచ్చేందుకే సరిపోతోందని, ఇక ఫ్యామిలీతో గడిపేందుకు కూడా తీరిక దొరకని పరిస్థితి నెలకొందని సెక్రటరీలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలంటూ ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లతో సెక్రెటరీలను వేధిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్ పోమ్మన లేక పొగ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పని తీరు మెరుగుపరిచేందుకే..
జిల్లాలోని గ్రామ పంచా యతీ సెక్రటరీల పని తీరు మెరుగు పరిచేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. వంద మార్కుల ఎగ్జామ్ లో 35 మార్కులకు పాస్, 80 మార్కులు వచ్చినవాళ్ల సేవలను మరింతగా.. మెరుగైనచోట వినియోగించుకుంటాం. తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు శిక్షణ ఇచ్చి మెరుగ్గా పని చేసేలా చూస్తాం. సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలు చేసేందుకే ఈ పరీక్ష.
- శ్రీకాంత్, డీపీవో, ఆసిఫాబాద్